Russia: పుతిన్‌తో మోదీ భేటీ... రష్యన్‌లోనే ట్వీట్ చేసిన భారత ప్రధాని
- ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన భేటీ
- భారత్, రష్యా సంబంధాలపై చర్చ
- ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధంపైనా చర్చ జరిగిన వైనం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఈ భేటీ దాదాపుగా గంట పాటు సాగింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య మైత్రి, తాజా ప్రపంచ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. రష్యా, భారత్‌ల మధ్య వాణిజ్య, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారంపై వారు చర్చించారు.
ఈ భేటీలో భాగంగా ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధంపైనా చర్చ జరిగింది. చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని... ఉక్రెయిన్ విషయంలోనూ రష్యా ఇదే మంత్రాన్ని పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని పుతిన్‌కు మోదీ సూచించారు. ఉక్రెయిన్‌లో సాధారణ వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టాలని కూడా పుతిన్‌ను మోదీ కోరారు. భేటీ అనంతరం పుతిన్‌తో భేటీ ఆహ్లాదభరితంగా సాగిందని చెబుతూ మోదీ... రష్యన్ భాషలోనే ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.