Queen Elizabeth: బ్రిటన్ రాణి చివరి చూపు కోసం క్యూ కడుతున్న ప్రపంచ నేతలు
- సోమవారం లండన్ లో క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలు
- హాజరవనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
- భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు
బ్రిటన్ రాణి, దివంగత క్వీన్ ఎలిజబెత్ 2కి నివాళులు అర్పించేందుకు, ఆమెను చివరి సారి చూసేందుకు సాధారణ ప్రజలతో పాటు ప్రపంచ నాయకులు సైతం క్యూ కడుతున్నారు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు వివిధ దేశాలకు చెందిన నాయకులు శనివారం నుంచి లండన్ చేరుకుంటున్నారు. 70 ఏళ్ల పాటు బ్రిటన్ రాణిగా కొనసాగి రికార్డు సృష్టించిన క్వీన్ ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో ఈనెల 8న మరణించారు.
ఈ నేపథ్యంలో బ్రిటన్ లో పది రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో రాణి ఎలిజబెత్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. దాంతో, ప్రజలు అక్కడికి భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా సహా కామన్వెల్త్ దేశాల ప్రజలు.. క్వీన్ ఎలిజబెత్ ను కడసారి చూసేందుకు విపరీతమైన చలిలో కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. శవ పేటిక వద్దకు చేరుకునేందుకు 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
మరోవైపు క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సహా వందలాది మంది ప్రముఖులు లండన్ వస్తున్నారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక నివాళి అర్పించనున్నారు. శనివారమే లండన్ చేరుకుని సోమవారం అంత్యక్రియల్లో కూడా పాల్గొంటారు. పలు దేశాధినేతలు, వందలాది ప్రముఖులు లండన్ చేరుకుంటున్న నేపథ్యంలో బ్రిటన్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. రాణి వారసుడు, కింగ్ చార్లెస్ 3, కామన్వెల్త్ రాజ్యాల ప్రధాన మంత్రులతో శనివారం సమావేశమవుతారు. బ్రిటన్‌తో పాటు ఇప్పుడు తాను పాలించే 14 రాజ్యాధినేతలతో మాట్లాడతారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి కెనడా వరకు కింగ్ చార్లెస్ 3ని తమ కొత్త సార్వభౌమాధికారిగా అధికారికంగా ప్రకటించాయి.