KTR: కేంద్ర హోంమంత్రి బెదిరింపులకు పాల్పడ్డారు: అమిత్ షాపై పరోక్షంగా కేటీఆర్ విమర్శలు
- 74 ఏళ్ల కిందట ఓ కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను భారత్ లో విలీనం చేశారన్న కేటీఆర్
- నాడు ఆయన సమైక్యతను చాటారని వ్యాఖ్య
- ఇప్పుడు ఓ కేంద్ర మంత్రి ప్రజలను విభజించేందుకు వచ్చారని ఆరోపణ
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరోక్షంగా అమిత్ షాను ఉద్దేశిస్తూ.. ప్రజలను విభజించేందుకు వచ్చారని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
‘‘74 ఏళ్ల క్రితం ఒక కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్రజలను ఇండియన్ యూనియన్ లో విలీనం చేసి సమైక్యతను చాటారు. ఇవాళ ఓ కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్రజలను విభజించి.. రాష్ట్ర ప్రభుత్వంపై బెదిరింపులకు పాల్పడేందుకు వచ్చారు. అందుకే చెబుతున్నాను. దేశానికి కావాల్సింది విభజన రాజకీయాలు కాదు. నిర్ణయాత్మక రాజకీయాలు కావాలి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
పరోక్షంగా ఉద్దేశిస్తూ...
బీజేపీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ పరోక్షంగా అమిత్ షాను ఉద్దేశిస్తూ ఘాటుగా ట్వీట్ చేశారు. కాగా మంత్రి కేటీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.