Tollywood: మళ్లీ యుద్ధానికి రెడీ అవుతున్న వరుణ్ తేజ్!
- తన 13వ చిత్రానికి సంబంధించి అప్డేట్ ఇచ్చిన వరుణ్
- స్క్రిప్టు చదువుతున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన యువ నటుడు
- ఈ నెల 19న చిత్రం గురించి అధికారిక ప్రకటన
మెగా కాంపౌండ్ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్. 'ముకుంద' మొదలు 'కంచె, అంతరిక్షం, లోఫర్, గద్దలకొండ గణేష్, ఎఫ్2, ఫిదా' వరకూ వైవిధ్యమైన సబ్జెక్టులను ఎంచుకొని నటుడిగా తనను తాను నిరూపించుకుంటున్నాడు. మాస్, కమర్షియల్, కామెడీ సినిమాలతో ముందుకెళ్తున్నాడు. కానీ, వరుస విజయాల తర్వాత ఈ మధ్య అతను వైఫల్యాల బాట పట్టాడు. తను సోలో హీరోగా చేసిన గని ఫ్లాప్ అవగా.. ఎఫ్3 అంతగా ఆకట్టుకోలేకపోయింది. మంచి విజయంతో మళ్లీ సక్సెస్ బాట పట్టాలని ఆశిస్తున్న వరుణ్ మరో కొత్త చిత్రానికి కమిట్మెంట్ ఇచ్చాడు. తన 13వ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఈ నెల 19వ తేదీన రానుంది.
ఈ మేరకు ఓ చిన్న వీడియోను వరుణ్ ఈ రోజు ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ వీడియోలో తను స్క్రిప్ట్ ను చదువుతున్నాడు. చివరి పేజీలో ‘జై హింద్’ అని కనిపించగానే.. వరుణ్ తేజ్ పెదాలపై చిరునవ్వు కనిపిస్తుంది. అనంతరం స్క్రిప్ట్ పేపర్లపై ఓ యుద్ధ విమానం బొమ్మను ఉంచి కళ్లద్దాలు పెట్టుకుని.. అతను ముందు నడుస్తుండగా.. భీకర శబ్దాలు చేస్తూ.. యుద్ధ విమానం ఎగురుతుంది. సెప్టెంబర్ 19వ తేదీన ప్రకటన అంటూ వీడియో ముగుస్తుంది.
ఇవన్నీ చూస్తుంటే వరుణ్ మరోసారి యుద్ధం నేపథ్యంలో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో కంచె సినిమాలో అతను సిపాయిగా కనిపించాడు. ఈ సారి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో నడుస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం దర్శక, నిర్మాతలు, ఇతర తారాగణం గురించి తెలియాలంటే ఈ నెల 19వ తేదీ వరకు ఆగాలి.