Nagababu: పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితే నైతిక విలువలతో కూడిన పాలన చూడొచ్చనే చర్చ జరుగుతోంది: నాగబాబు
- 'నా సేన కోసం... నా వంతు' పేరిట విరాళాలకు పిలుపునిచ్చిన జనసేన
- విశాఖ జనసైనికుల విరాళం
- రూ.2.50 లక్షల చెక్కు నాగబాబుకు అందజేత
- ఏపీలో జనసేన విజయం ఖాయమని ధీమా
- జనసేన కోసం ప్రజలంతా ఒక్కటవుతున్నారని వెల్లడి
నా సేన కోసం... నా వంతు... పేరిట జనసేన పార్టీ విరాళాలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖ జనసైనికులు పీవీ శివప్రసాద్, శ్రీకాంత్, ధర్మేంద్ర, వీరేంద్ర రూ.2.50 లక్షల విరాళాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబుకు అందించారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, 'నా సేన కోసం... నా వంతు..' అని పార్టీ ఇచ్చిన పిలుపునకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూస్తుంటే జనసేన విజయం ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. ఏపీలో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనే బలమైన అభిప్రాయం రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు.
జనసేన గెలుపు కోసం జనమంతా ఒక్కటవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలన్నా, ఆధిపత్య రాజకీయ ధోరణికి అడ్డుకట్ట వేయాలన్నా జనసేన పార్టీయే ప్రత్యామ్నాయం అనే బలమైన భావన ప్రజల్లో కలిగిందని నాగబాబు వివరించారు.
పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితే నైతిక విలువలు కలిగిన పరిపాలన చూడొచ్చనే చర్చ జరుగుతోందని వెల్లడించారు. కాగా, విశాఖ జనసైనికుల నుంచి విరాళం స్వీకరిస్తున్న సమయంలో నాగబాబు చేతికి కట్టుతో కనిపించారు.