Wheat: చపాతీలు, బ్రెడ్.. రెండింటిలో ఏది మంచిది? నిపుణుల సూచనలు ఇవిగో
- రెండూ కూడా గోధుమ పిండితోనే తయారు అవుతాయి
- బ్రెడ్ తయారు చేసేటప్పుడు ప్రాసెస్ చేయడం వల్ల ఫైబర్ పోతుందన్న నిపుణులు
- బ్రెడ్ త్వరగా జీర్ణమై వేగంగా శక్తిని విడుదల చేస్తుందని వెల్లడి
- తక్షణ శక్తి కోసం బ్రెడ్ తీసుకోవచ్చని.. బరువు తగ్గడం, ఆకలి నియంత్రణ కోసం చపాతీ మంచిదని సూచన
చపాతీలు, బ్రెడ్ రెండూ గోధుమ పిండి నుంచే తయారవుతాయి. మిల్క్ బ్రెడ్ అయితే మైదా (పొట్టు తొలగించిన గోధుమల పిండి)తో, హోల్ వీట్ బ్రెడ్ అయితే పూర్తిస్థాయి గోధుమ పిండితో తయారు చేస్తారు. అటు చపాతీలు, ఇటు బ్రెడ్ కూడా విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. పొద్దున్నే టీతోనో, పాలతోనో బ్రెడ్ తినేవారు కూడా ఎక్కువే. రెడీగా కొనుక్కుని తినగలగడం, పిల్లలు కూడా ఇష్టంగా తినడం బ్రెడ్ కు ఉన్న అనుకూలతలు. మరి చాలా పోలికలు ఉన్నా బ్రెడ్, చపాతీలలో ఏది బెటర్, దేనితో ఏమేం లాభాలు ఉంటాయనే దానిపై నిపుణులు చెబుతున్న సూచనలివీ..
చపాతీ, బ్రెడ్ లతో ఉండే ప్రయోజనాలు, తేడాలు ఇవీ..
- బ్రెడ్ కోసం వినియోగించే మైదా పిండి ప్రాసెస్ చేసినది. అంతేగాకుండా బ్రెడ్ తయారీ ప్రక్రియలోనూ ప్రాసెసింగ్ జరుగుతుందని.. దాంతో అందులోని ఫైబర్ పోతుందని నిపుణులు చెబుతున్నారు. అదే చపాతీలలో పూర్తి స్థాయి గోధుమ పిండిని ఉపయోగించడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. ఎక్కువ ఫైబర్ ఉన్న చపాతీతో జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు.
- బ్రెడ్ ను తయారుచేసేటప్పుడు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు కొన్ని రసాయనాలు కలుపుతారు. అదే చపాతీ కోసం గోధుమ పిండిలో రసాయనాలు ఏమీ కలపరని, ఈ లెక్కన చపాతీలు ఆర్గానిక్ అన్నట్టు భావించొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
- చపాతీలను ఒక్క గోధుమ పిండితో మాత్రమేగాకుండా జొన్నలు, సజ్జలు, ఇతర తృణ ధాన్యాలతో కూడా చేసుకుంటారు. అలాంటి వాటితో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
- బ్రెడ్ పొంగడానికి ఈస్ట్ ను కలుపుతారు. దీనివల్ల అటు ప్రయోజనాలు, ఇటు నష్టాలు రెండూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈస్ట్ మన జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు తోడ్పడుతుందని.. అయితే శరీరంలోంచి నీటిని తొలగించేందుకూ కారణమవుతుందని పేర్కొంటున్నారు.
- పోషకాల పరంగా చూస్తే.. బ్రెడ్ కంటే చపాతీ చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. బ్రెడ్ లో ఉండే పోషకాలు ప్రాసెసింగ్ లో వెళ్లిపోతాయని చెబుతున్నారు.
- మధుమేహంతో బాధపడేవారికి చపాతీలు మంచిదని.. బ్రెడ్ తో శరీరంలో వేగంగా గ్లూకోజ్ విడుదల అవుతుందని వివరిస్తున్నారు.
- అరుగుదల పరంగా చూస్తే.. బ్రెడ్ చాలా వేగంగా జీర్ణం అవుతుందని, త్వరగా శక్తిని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. వేగంగా శక్తి అవసరమైనప్పుడు బ్రెడ్ తో ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.
- బరువు తగ్గాలనుకునేవారు తాము రెగ్యులర్ గా తీసుకునే ఆహారాన్ని కాస్త తగ్గించి, బ్రెడ్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని.. అయితే బ్రెడ్ ను కూడా పరిమితంగా తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.