Sajid Mir: ముంబయి దాడుల నిందితుడ్ని బ్లాక్ లిస్టులో చేర్చే తీర్మానాన్ని అడ్డుకున్న చైనా
- 2008లో ముంబయి దాడులు
- ముంబయిలో మారణహోమం
- మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న సాజిద్ మీర్
- మీర్ పై 50 లక్షల డాలర్ల రివార్డు
- అతడిపై నిషేధం కోసం పోరాడుతున్న అమెరికా, భారత్
భారత్ పట్ల చైనా మరోసారి తన కుటిలనీతిని చాటుకుంది. 26/11 ముంబయి దాడుల ప్రధాన నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్ ను ఐరాస నిషిద్ధ వ్యక్తుల జాబితాలో చేర్చే తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. ఈ తీర్మానాన్ని చైనా అడ్డుకోవడం గత నాలుగు నెలల్లో ఇది మూడోసారి.
సాజిద్ మీర్ భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. అతడి తలపై 50 లక్షల డాలర్ల రివార్డు కూడా ఉంది. అతడిని నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలంటూ అమెరికా, భారత్ కొంతకాలంగా ఐక్యరాజ్యసమితి వేదికగా పోరాడుతున్నాయి.
తాజాగా, అమెరికా, భారత్ దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రతిపాదించగా, చైనా తనకున్న ప్రత్యేక అధికారంతో ఆ తీర్మానాన్ని నిలుపుదల చేసింది. ఒకవేళ, సాజిద్ మీర్ ను బ్లాక్ లిస్టులో చేర్చితే, ప్రపంచవ్యాప్తంగా అతడి ఆస్తులను స్తంభింపచేయవచ్చు, అతడిపై ప్రయాణ నిషేధం అమలవుతుంది. అంతేకాదు, అతడు ఆయుధాల కొనుగోలు చేయలేడు.
కాగా, సాజిద్ మీర్ ను పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు ఉగ్రవాదులకు ఆర్థిక సాయం కేసులో దోషిగా నిర్ధారించి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పాకిస్థాన్ తన గడ్డపై నుంచి కార్యకలాపాలు జరిపే ఉగ్రవాదులను కట్టడి చేయకపోతే తీవ్రస్థాయిలో ఆర్థిక ఆంక్షలు తప్పవని పారిస్ లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) హెచ్చరించిన నేపథ్యంలో... పాక్ పలు చర్యలు చేపడుతోంది.