Kottapalli Geetha: జైలు నుంచి విడుదలైన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులు
- పీఎన్‌బీ మోసం కేసులో గీత దంపతులకు జైలుశిక్ష
- హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందిన గీత, కోటేశ్వరరావు
- కోర్టు ఉత్తర్వులు అందడంతో విడుదల చేసిన జైలు అధికారులు
పంజాబ్ నేషనల్ భ్యాంకును మోసం చేసిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త కోటేశ్వరరావులు శనివారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష విధిస్తూ తీర్పను ఇవ్వడంతో గీత దంపతులను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు రెండు రోజుల క్రితం చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
అయితే సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన వెంటనే గీత దంపతులు తెలంగాణ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలు అందడంతో జైలు అధికారులు గీత దంపతులను శనివారం సాయంత్రం విడుదల చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) నుంచి వ్యాపారం నిమిత్తం రూ.42 కోట్ల మేర రుణం తీసుకున్న గీత దంపతులు ఆ రుణాన్ని చెల్లించలేదు. దీంతో బ్యాంకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను పూర్తి చేసిన సీబీఐ కోర్టు గీత దంపతులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా గీత దంపతులకు సహకరించిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులకు కూడా అదే శిక్ష విధించిన సంగతి తెలిసిందే.