Pawan Kalyan: పవన్ కల్యాణ్ బస్సు యాత్ర వాయిదా
- అక్టోబరు 5 నుంచి బస్సు యాత్ర అని ఇంతకుముందు ప్రకటన
- తన నిర్ణయాన్ని మార్చుకున్న పవన్ కల్యాణ్
- ఈ లోపు కౌలు రైతు భరోసా, జనవాణి కార్యక్రమాలు పూర్తిచేస్తామని వెల్లడి
వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో జనసేనాని పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. ఆయన అక్టోబరు 5న బస్సు యాత్ర ప్రారంభించాలని అనుకున్నారు. ఇప్పుడా నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ మార్చుకున్నారు. అక్టోబరులో తలపెట్టిన బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ లోపు కౌలు రైతుల భరోసా యాత్ర, జనవాణి కార్యక్రమాలు పూర్తి చేస్తామని వెల్లడించారు.
పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరి కార్యాలయంలో జనసేన లీగల్ సెల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పై విషయాలు వెల్లడించారు.
ఇక, 2014లో తానేమీ టీడీపీకి గుడ్డిగా మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. భారీ స్థాయిలో కాకుండా చిన్నస్థాయి రాజధాని ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రభుత్వానికి సూచించానని వెల్లడించారు. రాజధానిపై అసెంబ్లీలో ఇచ్చిన మాటను వైసీపీ తప్పిందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంలో జగన్ కు శ్రద్ధ లేదా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఎక్కువగా ఉందని అన్నారు.
అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 నుంచి 67 స్థానాలే వస్తాయని సర్వేలు చెబుతున్నాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని సర్వేల్లో తేలిందని వివరించారు.