Usha Bai: గవర్నర్ ను కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషా బాయి
- ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్
- పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు
- రిమాండ్ విధించిన కోర్టు
- చర్లపల్లి జైలుకు రాజా సింగ్
- అక్రమ కేసులపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరిన ఉషా బాయి
ఓ మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసుల అరెస్ట్ చేయడం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మొదటిసారిగా ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు చేయడం రాజాసింగ్ విషయంలోనే జరిగింది. ఆయనను కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ప్రస్తుతం రాజాసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు.
ఈ నేపథ్యంలో, రాజాసింగ్ అర్ధాంగి ఉషా బాయి నేడు రాజ్ భవన్ కు తరలి వెళ్లి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. తన భర్త రాజాసింగ్ పై అక్రమంగా పీడీయాక్ట్ బనాయించారని ఆవేదన వెలిబుచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ వర్గాన్ని సంతృప్తి పరిచేలా వ్యవహరిస్తుండడంతో, తన భర్త దాన్ని వ్యతిరేకించారని, దాంతో తన భర్తపై అక్రమ కేసులు నమోదు చేశారని ఉషా బాయి ఆరోపించారు.
పోలీసులు చెబుతున్న 100కి పైగా కేసులన్నీ మోటివేటెడ్ కేసులేనని వివరించారు. ఆ కేసులు ప్రజాప్రతినిధుల కోర్టులో కొట్టేసినవేనని ఉషా బాయి స్పష్టం చేశారు. పోలీసులు పెట్టిన అక్రమ కేసులపై జోక్యం చేసుకోవాలంటూ ఆమె గవర్నర్ ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.