Jammu And Kashmir: కశ్మీర్‌లో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న సినిమా థియేటర్లు.. ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్

Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha inaugurated multipurpose cinema halls

  • 1980 వరకు జమ్మూకశ్మీర్‌లో నడిచిన సినిమా థియేటర్లు
  • ఉగ్రవాదం పెచ్చుమీరడంతో 1990 దశకంలో మూతబడిన హాళ్లు
  • మరిన్ని మాల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్న గవర్నర్ మనోజ్ సిన్హా
  • వచ్చే వారం తొలి ఐనాక్స్ థియేటర్ ప్రారంభం

ఉగ్రవాదం కారణంగా జమ్మూకశ్మీర్‌లో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మూతబడిన సినిమా థియేటర్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. పుల్వామా, సోపియాలలో ఆదివారం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మల్టీ పర్పస్ సినిమా హాళ్లను ప్రారంభించి సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో జమ్మూలోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సినిమా థియేటర్లు తిరిగి తెరుచుకోవడం చారిత్రాత్మకమన్న ఆయన.. ప్రస్తుతం ప్రారంభించిన సినిమా హాళ్లను పుల్వామా, సోపియా యువతకు అంకితం చేస్తున్నట్టు చెప్పారు.

జమ్మూకశ్మీర్‌లో త్వరలో మరిన్ని థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. అనంత్‌నాగ్, శ్రీనగర్, బందిపొరా, గందర్‌బల్, దోడా, రాజౌరి, ఫూంచ్, కిష్ట్వార్, రియాసీలలో ఇవి ప్రారంభం కానున్నాయి. ఇక్కడ సినిమా ప్రదర్శనతోపాటు ఇన్ఫోటైన్‌మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే వచ్చే వారం తొలి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. 520 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ థియేటర్ శ్రీనగర్‌లోని సోమ్‌వార్ ప్రాంతంలో ఉంది. ఇందులో మూడు స్క్రీన్లు ఉన్నాయి.  

జమ్మూకశ్మీర్‌లో 1980 వరకు సినిమా థియేటర్లు ఉండేవి. అయితే, ఆ తర్వాత ఉగ్రవాదం పెచ్చుమీరడంతో 1990 దశకంలో సినిమా హాళ్లన్నీ మూతపడ్డాయి. దీంతో జమ్మూకశ్మీర్ ప్రజలు వినోదానికి దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ వాటిని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, 1999లో శ్రీనగర్‌ లోని లాల్‌చౌక్‌లో ఉన్న రీగల్ థియేటర్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి దిగడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ఇక అప్పటి నుంచి జమ్మూకశ్మీర్ ప్రజలకు వినోదం అందుబాటులో లేకుండా పోయింది.

  • Loading...

More Telugu News