Roja: ఎమ్మెల్యేగా గెలవని నువ్వు మా జాతకం చెబుతుంటే నవ్వొస్తోంది: పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా వ్యాఖ్యలు
- నిన్న జనసేన లీగల్ సెల్ సమావేశం
- వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించిన పవన్
- తీవ్రస్థాయిలో స్పందించిన రోజా
- ముందు సర్పంచ్ లు గా గెలవాలని హితవు
- 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అంటూ సవాల్
నిన్న జనసేన లీగల్ సెల్ సమావేశంలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 45 నుంచి 67 సీట్లే వస్తాయని పవన్ చెప్పారు. దీనిపై ఏపీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు.
ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు జాతకం చెబుతుంటే నవ్వొస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. మాకు 45 సీట్లు వస్తే మిగిలిన 130 సీట్లు నీకే వస్తాయా? అని ప్రశ్నించారు. ముందు సర్పంచ్ లుగా గెలవండి... ఆ తర్వాత ఎమ్మెల్యేల గురించి ఆలోచించవచ్చు అంటూ ఎద్దేవా చేశారు.
జనసేన తరఫున పోటీచేసేందుకు 175 స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారా...? అని వ్యంగ్యం ప్రదర్శించారు. అసలు, 175 స్థానాల్లో జనసేనను బరిలో దింపేంత దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందా? అని రోజా ప్రశ్నించారు. "జగన్ సీఎం కాడు ఇదే నా శాసనం అని అన్నావు... శాసనం అన్నవాడ్ని శాసనసభలోకి కూడా రానివ్వలేదు... ఈ విషయం మర్చిపోయావా?" అని ఎద్దేవా చేవారు.
పవన్ సభలకు వచ్చేది గ్రామాల్లో సినిమా పిచ్చి ఉన్నవాళ్లేనని, వాళ్లను చూసి పవన్ రెచ్చిపోతున్నాడని, సీఎం అంటూ కలలు కని బొక్కబోర్లాపడ్డాడని విమర్శించారు. నువ్వు తెలుగు హీరో అని చెప్పుకోవడానికి చిత్రపరిశ్రమలో ఉన్న హీరోలంతా సిగ్గుపడుతున్నారు అని వ్యాఖ్యానించారు.
గతంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి సింగిల్ గా పోటీ చేశారని వెల్లడించారు. చిరంజీవి కూడా సింగిల్ గానే పోటీ చేశారని, అదే రక్తం పంచుకుపుట్టిన నువ్వు మాత్రం పార్టీ పెట్టావే కానీ, ఎన్నికలకు వెళ్లావా? అని నిలదీశారు.
"2014లో ప్యాకేజీ తీసుకుని బీజేపీకి ఓటేయండి, టీడీపీకి ఓటేయండి అని చెప్పావు. రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిలా మారిందంటే అది నువ్వు, నువ్వు సపోర్ట్ చేసిన పార్టీలే అందుకు కారణం" అంటూ రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని ఆరోపించారు