Electric Bus: తిరుమల కొండకు ఎలక్ట్రిక్ బస్సుతో ట్రయల్ రన్
- తిరుమల కొండపై కాలుష్య నివారణకు చర్యలు
- ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు ఒప్పందం
- అలిపిరి డిపోకు చేరుకున్న పలు బస్సులు
- తిరుపతి నుంచి రెండో ఘాట్ రోడ్డు ద్వారా ప్రయాణించిన బస్సు
తిరుమల కొండపై కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, నేడు తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆర్టీసీ నిపుణులు ఈ బస్సులో ఎక్కి తిరుపతి నుంచి రెండో ఘాట్ రోడ్డు ద్వారా తిరుమల చేరుకున్నారు. ఎత్తయిన ప్రదేశాలు, మలుపుల వద్ద ఈ ఎలక్ట్రిక్ బస్సు పనితీరును పరిశీలించారు.
కాగా, రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఏపీ ప్రభుత్వం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం 100 బస్సులను ఒలెక్ట్రా ఏపీఎస్ఆర్టీసీకి అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు బస్సులు అలిపిరి డిపోకు చేరుకున్నాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లనే ఈ విద్యుత్ ఆధారిత బస్సుల్లో డ్రైవర్లుగా నియమించనున్నారు.