Margadarshi: మార్గదర్శి కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ.. వివరాలు తెలిపిన ఉండవల్లి
- పిటిషన్లనన్నింటినీ విచారించిన సుప్రీంకోర్టు
- గతంలో పిటిషన్ వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్
- ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ సర్కారు
- స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన రామోజీరావు
మార్గదర్శి కేసుపై దాఖలైన పిటిషన్లనన్నింటిని సుప్రీంకోర్టు నేడు విచారించింది. గతంలో మార్గదర్శి వ్యవహారంపై ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ వేయగా, ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. రామోజీరావు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలు విన్నది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టులో నేటి విచారణకు సంబంధించిన వివరాలను ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వంతో పాటు, రామోజీరావుకు నోటీసులు పంపిందని, నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించిందని తెలిపారు.
అటు, రామోజీ రావు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపిందని వెల్లడించారు. గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్ లో ఇంప్లీడ్ కావాలని కోరినా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేదని, సీఎం కేసీఆర్ చెప్పినా ఎందుకనో గానీ జాప్యం జరిగిందని ఉండవల్లి అన్నారు. తాజాగా నోటీసులు జారీ అయిన నేపథ్యంలో, ఈసారి తెలంగాణ ప్రభుత్వం తప్పక స్పందించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.