Narayana: టీడీపీ నేత నారాయణపై లుకౌట్ నోటీసులు తొలగించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు
- నారాయణపై సీఐడీ కేసు.. లుకౌట్ నోటీసుల జారీ
- చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉన్న నారాయణ
- అడ్డంకిగా మారిన లుకౌట్ నోటీసులు
- హైకోర్టును ఆశ్రయించిన నారాయణ
అమరావతి మాస్టర్ ప్లాన్, రింగ్ రోడ్డు అలైన్ మెంట్ విషయంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసిన వారిలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ కూడా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నారాయణ పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. సీఐడీ కేసు నేపథ్యంలో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
అయితే, నారాయణ వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఈ లుకౌట్ నోటీసులు అడ్డంకిగా మారాయి. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించినా, ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్ద క్లియరెన్స్ పొందేందుకు లుకౌట్ నోటీసులు ప్రతిబంధకంగా పరిణమించాయి. దాంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై లుకౌట్ నోటీసుల అంశాన్ని సమీక్షించాలని కోరారు.
నారాయణ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. నారాయణపై జారీ అయిన లుకౌట్ నోటీసులను ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో, నారాయణ డిసెంబరు 22 నాటికి అమెరికా నుంచి తిరిగి రావాలని స్పష్టం చేసింది.