Karnataka: ఖురాన్ మాత్రమే మతపరమైన గ్రంథం... భగవద్గీత కాదు: కర్ణాటక మంత్రి నాగేశ్
- డిసెంబర్ నుంచి పాఠశాలల్లో భగవద్గీతను బోధిస్తామన్న మంత్రి
- దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడి
- స్వాతంత్ర్య పోరాట సమయంలో కూడా ఎందరిలోనో గీత స్ఫూర్తిని నింపిందని వ్యాఖ్య
పాఠశాలల్లో భగవద్గీతను బోధించబోతున్నామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ తెలిపారు. ఖురాన్ అనేది మతపరమైన గ్రంథం అని... భగవద్గీత మత గ్రంథం కాదని ఆయన చెప్పారు. మత విశ్వాసాల గురించి కానీ, దేవుడిని పూజించే అంశాల గురించి కానీ భగవద్గీత ఎక్కడా చెప్పడం లేదని అన్నారు.
నైతిక విలువల గురించి భగవద్గీత బోధిస్తుందని... విద్యార్థులకు గీత బోధన ఎంతో ఉపయుక్తమవుతుందని చెప్పారు. విద్యా సంస్థల్లో గీతను బోధించడానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అన్నారు. కర్ణాటక పాఠశాలల్లో డిసెంబర్ నుంచి ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో నైతిక విద్యను బోధిస్తామని తెలిపారు.
మరోవైపు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో ముస్లింలు మండిపడుతున్నారు. పాఠశాలల్లో భగవద్గీతను బోధించినప్పుడు... ఖురాన్ ను ఎందుకు బోధించరని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మంత్రి నాగేశ్ మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరం సమయంలో కూడా ఎందరిలోనే గీత స్ఫూర్తిని నింపిందని చెప్పారు.
పాఠశాలల్లో గీతను బోధించడంపై ప్రభుత్వం ఒక ఎక్స్ పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిందని... కమిటీ ఇచ్చిన రెకమెండేషన్స్ ఆధారంగా డిసెంబర్ నుంచి పాఠశాలల్లో గీతను బోధించబోతున్నామని తెలిపారు. కర్ణాటకకు చెందిన స్థానిక రాజుల గురించి కూడా పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని చెప్పారు. ఇప్పటి వరకైతే పాఠ్యపుస్తకాల్లో గంగ, హోయసల, మైసూర్ వడయార్, విజయపురకు చెందిన ఆదిల్షాహి, సురపుర నాయక, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, తెలు నాడు, యలహంక నాదప్రభు, చిత్రదుర్గ యోధుల చరిత్ర పాఠ్యాంశాల్లో ఉన్నాయని తెలిపారు.