Andhra Pradesh: టీడీపీ సభ్యుల తీరుపై చర్యలకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేసిన స్పీకర్
- ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మారుస్తూ వైసీపీ తీర్మానం
- తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు
- స్పీకర్ తమ్మినేని సీతారాంను చుట్టుముట్టి పేపర్లు చించేసిన వైనం
- టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం నాటి సమావేశాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో వైసీపీ సర్కారు పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తూ ఓ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు బిల్లు ప్రతులను చింపి స్పీకర్ తమ్మినేని సీతారాంపై విసిరేశారు. అధికార పక్షం తీర్మానంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిన తమ్మినేని... సభ ముగిసిన తర్వాత టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... వారి వ్యవహార సరళిపై చర్యలకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేశారు. సభలో సభ్యుల అనుచిత ప్రవర్తనపై దర్యాప్తు చేపట్టే ప్రివిలేజ్ కమిటీ అనుచిత వర్తన కలిగిన సభ్యులపై చర్యలకు సిఫారసు చేసే అవకాశం ఉంది.