HURUN INDIA RICH LIST 2022: ఏపీ, తెలంగాణలో 78 మంది కుబేరులు.. రూ. 1000 కోట్లకు పైగా సంపదతో రికార్డుల్లోకి!
- జాబితా విడుదల చేసిన ఐఐఎఫ్ఎల్, హురూన్ ఇండియా
- 78 మంది మొత్తం సంపద రూ. 3,90,500 కోట్లు
- ఫార్మా రంగం నుంచే అత్యధిక సంపన్నులు
దేశంలో రూ. 1000 కోట్లు, అంతకుమించిన సంపద కలిగిన ధనవంతుల జాబితాను హురూన్ రిపోర్ట్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ విడుదల చేసింది. ‘ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్‌లిస్ట్ 2022’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 78 మందికి చోటు లభించింది. వీరి మొత్తం సంపదను రూ.3,90,500 కోట్లుగా పేర్కొంది. అలాగే, ఏపీ, తెలంగాణ నుంచి 11 మంది అమెరికా బిలియనీర్లు ఉన్నారు.
తాజా జాబితా ప్రకారం.. ఏపీ, తెలంగాణలోని ధనవంతుల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 3 శాతం పెరిగింది. రూ.56,200 కోట్లతో దివీస్ లేబొరేటరీకి చెందిన కుటుంబం ఈ జాబితాలో చోటు దక్కించుకున్న అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రూ.39,200 కోట్లతో హెటిరో ల్యాబ్స్‌కు చెందిన బి.పార్థసారథిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అలాగే, హైదరాబాద్‌కు చెందిన 64 మంది, విశాఖపట్టణానికి చెందిన ఐదుగురు, రంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురికి ఈ జాబితాలో చోటు లభించింది.
ఈ జాబితాపై ఐఐఎఫ్ఎల్ వెల్త్ కో ఫౌండర్, జాయింట్ సీఈఓ యతిన్ షా మాట్లాడుతూ.. దేశ సంపద పెరిగేందుకు దోహదపడిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించినట్టు తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి చోటు దక్కించుకున్న వారిలో అత్యధికంగా 75 మంది ఏపీ, తెలంగాణకు చెందిన వారే ఉండడం గమనార్హం. జాబితాలోని వ్యక్తుల సంఖ్య పరంగా ఏపీ, తెలంగాణలోని అత్యంత సంపన్నుల్లో ఎక్కువమంది ఫార్మారంగానికి చెందిన వారు కావడం మరో విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ అండ్ బేవరేజెస్, కన్‌స్ట్రక్షన్, కెమికల్ రంగాలకు చోటు దక్కింది. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణ నుంచి మరింతమందికి ఈ జాబితాలో చోటు లభిస్తుందని ఆశిస్తున్నట్టు యతిన్ షా పేర్కొన్నారు.
హురూన్ ఇండియా ఎండీ, చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ.. తాము 11 ఏళ్లలో 26 సార్లు జాబితాను విడుదల చేసినట్టు చెప్పారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఏపీ, తెలంగాణ రిచ్ లిస్ట్ లో చేరిన వారి సంఖ్య మూడుతో ప్రారంభమై నేడు 79కి పెరిగిందని అన్నారు. వచ్చే ఐదేళ్లు ఇదే లెక్కన కొనసాగితే వచ్చే దశాబ్దం నాటికి ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ నుంచి 200 మందికి చోటు లభిస్తుందన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తదితరాలతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం నెలకొన్న వేళ భారత్ దానిని అధిగమించినట్టు ఈ జాబితా రుజువు చేస్తోందన్నారు. రూ. 100 లక్షల కోట్ల సంపదతో దేశంలోని 1,103 మంది ఈ జాబితాకు ఎక్కినట్టు జునైద్ వివరించారు.
టాప్-20 జాబితా ఇదే