Team India: హర్మన్​ భారీ సెంచరీ... ఇంగ్లండ్​ గడ్డపై 23 ఏళ్ల తర్వాత సిరీస్​ నెగ్గిన భారత్​ మహిళా జట్టు

India womens team registers series victory against England

  • రెండో వన్డేలో 88 పరుగులతో ఇంగ్లండ్ పై గెలుపు
  • మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం
  • చివరగా 1999లో ఇంగ్లండ్  లో సిరీస్ నెగ్గిన భారత మహిళలు

భారత మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై అద్భుతం చేసింది. 1999 తర్వాత ఇంగ్లండ్ లో వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 నాటౌట్‌) అజేయ సెంచరీకి తోడు పేసర్ రేణుకా సింగ్ (4/57) బౌలింగ్లో  సత్తా చాటడంతో బుధవారం అర్ధరాత్రి ముగిసిన రెండో వన్డేలో భారత్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో, మూడు వన్డేల సిరీస్ ను మరోటి మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. తొలుత భారత్ 333/5 పరుగుల భారీ స్కోరు చేసింది. వన్డేలో భారత జట్టుకిది రెండో అత్యధిక స్కోరు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్‌ సేన ఆరంభంలోనే షెఫాలీ (8) వికెట్‌ కోల్పోయింది. మరో ఓపెనర్‌ మంధాన (40), యస్తికా (26) రాణించారు. తర్వాత హర్మన్‌ హవా మొదలైంది. హర్లీన్‌ డియోల్ (58)తో కలిసి హర్మన్ నాలుగో వికెట్‌కు 113 పరుగులు జోడించింది. ఆపై, వస్త్రాకర్‌ (16)తో ఐదో వికెట్ కు 50 పరుగులు , దీప్తి శర్మ (15)తో ఆరో వికెట్‌కు 24 బాల్స్‌లోనే 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో  హర్మన్  ఫోర్లు, సిక్సర్లతో చెలరేగింది. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ  భారీ సెంచరీ కొట్టింది. 100 బంతుల్లో శతకం అందుకున్న ఆమె ఆ తర్వాత మరో 11 బాల్స్‌లోనే 43 రన్స్‌ రాబట్టి ఔరా అనిపించింది.

అనంతరం వన్డేల్లో అత్యధిక ఛేజింగ్ కు వచ్చిన ఇంగ్లండ్ మహిళల జట్టు 42.2 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. డానీ వ్యాట్ (65) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో రేణుకా సింగ్ నాలుగు, డి. హేమలత రెండు వికెట్లతో సత్తా చాటారు. హర్మన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే శనివారం జరుగుతుంది.

  • Loading...

More Telugu News