Bollywood: డ్రగ్స్ కేసులో కొడుకు ఆర్యన్ అరెస్టుపై తొలిసారి పెదవి విప్పిన షారూక్ భార్య గౌరీ ఖాన్

Gauri Khan finally breaks silence on son Aryan Khan arrest
  • గతేడాది ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్
  • 26 రోజులు కస్టడీలో ఉన్న షారూక్ కుమారుడు
  • కాఫీ విత్ కరణ్ షోలో అరెస్టు గురించి మాట్లాడిన గౌరీ
గత ఏడాది ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనేక కోర్టు విచారణలు, డ్రామాలు, 26 రోజుల కస్టడీ తర్వాత బాంబే హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు గురించి మీడియాలో ఎంతగా వచ్చినా షారూక్ కుటుంబంలో ఎవ్వరూ స్పందించలేదు. తాజాగా షారూక్ భార్య గౌరీ ఖాన్ ఇప్పుడు తన కుమారుడి అరెస్టుపై ఎట్టకేలకు పెదవి విప్పారు.. కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ లో భావనా పాండే, మహీప్ కపూర్‌లతో పాల్గొన్న ఆమె ఈ కేసు గురించి మాట్లాడారు. 

ఈ షో హోస్ట్ కరణ్ ఈ వివాదాస్పద కేసు గురించి గౌరీ ఖాన్‌తో మాట్లాడారు. ‘ఇది అతనికి చాలా కఠినమైన ప్రయాణం. ఈ కష్ట సమయంలో మీరంతా చాలా బలంగా నిలబడ్డారు. ఒక తల్లిగా మీరు ఎలా ఉంటారో నాకు తెలుసు. ఈ  పరిస్థితిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. మనదంతా ఒకే కుటుంబం. దీని తర్వాత మీరు గతంలో కంటే బలంగా తయారయ్యారు’ అని గౌరీతో కరణ్ చెప్పారు. 

దీనికి స్పందిస్తూ  గౌరీ తొలిసారి ఆర్యన్ ఖాన్ అరెస్ట్ గురించి మాట్లాడింది. ‘మనం అనుభవించిన దాని కంటే దారుణమైన పరిస్థితి మరోటి ఉండదు. ఈ కష్ట సమయంలో మనమంతా ఒక కుటుంబంలా నిలబడి ఉన్నాము. మాకు ఎంతో ప్రేమ లభించింది. మాకు తెలియని వాళ్ల నుంచి కూడా సందేశాలు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే మనం గొప్ప ప్రదేశంలో ఉన్నామని నేను చెప్పగలను. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ మేం రుణపడి ఉంటాం’ అని గౌరీ చెప్పుకొచ్చారు.
Bollywood
Shahrukh Khan
gauri khan
aryan khan
arrest
drugs case

More Telugu News