RSS: ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌ ‘జాతిపిత’.. అభివర్ణించిన ఇమామ్‌ల సంఘం అధ్యక్షుడు

RSS Chief Mohan Bhagwat Visits Mosque and Top Cleric Calls Him Rashtra Pita

  • ఢిల్లీలో మసీదు, మదర్సాను సందర్శించిన మోహన్ భగవత్
  • చిన్నారుల ఖురాన్ పఠనం, ఆపై ‘వందేమాతరం’ నినాదాలు
  • తమ డీఎన్ఏ ఒక్కటేనన్న ఇలియాసీ
  • భారత్‌కు వ్యతిరేకంగా కాఫిర్, జిహాద్ పదాలు ఉపయోగించొద్దని ఆరెస్సెస్ చీఫ్ సూచన

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్‌ను అఖిల భారత ఇమామ్‌ల సంఘం అధ్యక్షుడు ఉమర్ అహ్మద్ ఇలియాసీ ‘జాతిపిత’గా అభివర్ణించారు. ముస్లిం మత ప్రముఖులతో ఇటీవల వరుస సమావేశాలు నిర్వహిస్తున్న భగవత్ నిన్న ఢిల్లీలో ఓ మసీదును, మదర్సాను సందర్శించారు. తొలిసారి మదర్సాను సందర్శించిన ఆయన అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. వారి ఖురాన్ పఠనాన్ని విన్నారు. అనంతరం చిన్నారులు ‘వందేమాతరం’, ‘జై హింద్’ అంటూ నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా ఇమామ్‌ల సంఘం అధ్యక్షుడు ఇలియాసీ మాట్లాడుతూ.. తన ఆహ్వానం మేరకే మసీదు, మదర్సాను భగవత్ సందర్శించారని తెలిపారు. ఆయన జాతిపిత అని, దేశాన్ని బలోపేతం చేసేందుకు చాలా విషయాల గురించి తమ మధ్య చర్చ జరిగినట్టు చెప్పారు. తమకు ధర్మం కంటే దేశం ముఖ్యమని, తమ డీఎన్ఏ కూడా ఒక్కటేనని అన్నారు. కాకపోతే తమ మతాలు వేరని, దేవుడిని ఆరాధించే పద్ధతులు వేరని ఇలియాసీ పేర్కొన్నారు. 

ఇలియాసీ తనను జాతిపితగా అభివర్ణించినప్పుడు భగవత్ జోక్యం చేసుకుని ఆయనను వారించారని, అందరం భరతమాత బిడ్డలమేనని ఇలియాసీతో చెప్పినట్టు ఆరెస్సెస్ పేర్కొంది. అలాగే, హిందువులకు వ్యతిరేకంగా కాఫిర్, జిహాద్ వంటి పదాలను వాడొద్దని ముస్లిం నేతలకు భగవత్ సూచించారు.

  • Loading...

More Telugu News