Nikhil: ప్రపంచం మెచ్చిన 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ అవసరమా?: నిఖిల్
- ఆస్కార్ పైన తనకు మంచి అభిప్రాయం లేదన్న నిఖిల్
- ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఆస్కార్ కంటే ఎక్కువని వ్యాఖ్య
- స్పెయిన్ లో కూడా 'ఆర్ఆర్ఆర్' ఆడుతున్న థియేటర్లు హౌస్ ఫుల్ గా ఉన్నాయని వెల్లడి
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకోకపోవడంతో అందరూ అసంతృప్తికి గురవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తూ... ఈ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అవుతుందని భావించామని, చివరకు నిరాశ మిగిలిందని అన్నారు.
మరోవైపు హీరో నిఖిల్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. తనకు ఆస్కార్ అవార్డులపై పెద్ద ఆసక్తి కానీ, మంచి అభిప్రాయం కానీ లేదని చెప్పారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఆస్కార్ కంటే ఎక్కువని అన్నారు. మనకు ఫిల్మ్ ఫేర్, జాతీయ అవార్డులు ఉన్నాయని... అలాంటప్పుడు ఆస్కార్ అవార్డులు మనకెందుకని ప్రశ్నించారు.
భారతీయ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఆడుతున్నాయని నిఖిల్ చెప్పారు. తాను ఇటీవల స్పెయిన్ కు వెళ్లినప్పుడు అక్కడ 'ఆర్ఆర్ఆర్' చూశానని.. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లన్నీ ఫుల్ గా ఉన్నాయని తెలిపారు. స్పెయిన్ లోనే కాకుండా... సినిమా విడుదలైన అన్ని దేశాల్లో బ్రహ్మాండంగా ఆడుతోందని చెప్పారు. ఇంతకు మించి మనకు ఏం కావాలని... ఆస్కార్ మనకు అవసరమా? అని నిఖిల్ వ్యాఖ్యానించారు.