CM Ramesh: జగన్ నిర్ణయాన్ని ఆయన సొంత చెల్లెలు షర్మిలే తప్పుపట్టారు: సీఎం రమేశ్
- ఎన్టీఆర్ పేరును తొలగించాలనుకోవడం అన్యాయమన్న రమేశ్
- ఎదురు తిరిగిన వారిని ఖతం చేస్తాననే తరహాలో జగన్ పాలన ఉందని విమర్శ
- అమరావతి రైతుల యాత్రను అడ్డుకోవడం అంత ఈజీ కాదని వ్యాఖ్య
విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడం అన్యాయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించాలనే నిర్ణయాన్ని జగన్ సొంత చెల్లెలు షర్మిల కూడా తప్పుపట్టారని చెప్పారు. పేరు మార్పు నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆమె సూచించారని అన్నారు. తన రాజ్యంలో ఎవరు ఎదురు తిరిగినా వారిని ఖతం చేస్తాననే తరహాలో జగన్ పాలన కొనసాగుతోంది ఆయన విమర్శించారు. పరిపాలన ఇలా కొనసాగితే 175 సీట్లు గెలుస్తామని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. ఏపీ ప్రజల గురించి ఏమనుకుంటున్నారని అన్నారు.
అమరావతి రైతుల యాత్రను అడ్డుకోవడం అంత ఈజీ కాదని... బీజేపీ అండగా ఉన్నంత వరకు వారిని ఎవరూ అడ్డుకోలేరని సీఎం రమేశ్ చెప్పారు. ఉత్తరాంధ్రలో అమరావతి రైతుల యాత్రకు తాము రక్షణ కవచంగా ఉంటామని అన్నారు. అమరావతి రైతులపై దాడి చేస్తే బీజేపీపై చేసినట్టేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీకి మూడు సీట్లు కూడా రావని అన్నారు. ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు పూర్తిగా చెడగొట్టారని... డ్రగ్స్, గంజాయి, ల్యాండ్ మాఫియాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు రూ. 10 ఇచ్చి రూ. 100 దోచుకుంటోందని అన్నారు. జగన్ అసలు స్వరూపం ఏమిటో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని రమేశ్ చెప్పారు.