Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీలెవరూ ఉండరు: అశోక్ గెహ్లాట్
- కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
- రేసులో అందరి కంటే ముందు వరుసలో గెహ్లాట్
- ఈ దఫా గాంధీయేతరులే అధ్యక్షులు అవుతారన్ని రాహుల్
- తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయబోరని వెల్లడి
- రాహుల్ గాంధీ తనతో ఈ విషయాలు చెప్పారన్న గెహ్లాట్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రేసులో అందరికంటే ముందు ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి చెందిన వారెవరూ పోటీలో ఉండబోరని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధే తనతో చెప్పారని గెహ్లాట్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న డిమాండ్ల నేపథ్యంలో మొన్న సోనియా గాంధీతో భేటీ అయిన గెహ్లాట్... ఆ మరునాడే కేరళ వెళ్లి భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు మీరే చేపట్టాలంటూ ఆయన రాహుల్ గాంధీకి సూచించారు. యావత్తు కాంగ్రెస్ శ్రేణుల ఆకాంక్ష కూడా ఇదేనంటూ ఆయన రాహుల్ కు వివరించారు.
గెహ్లాట్ ప్రతిపాదనకు స్పందించిన రాహుల్ గాంధీ... ఈ దఫా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తమ కుటుంబానికి చెందిన వారెవ్వరూ ఉండబోరని చెప్పినట్లుగా గెహ్లాట్ తెలిపారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన నేత ఎంపికవుతారని రాహుల్ తెలిపినట్లుగా ఆయన వెల్లడించారు. ఈ దిశగా తాను ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నానని రాహుల్ తనతో చెప్పారని గెహ్లాట్ వివరించారు.