YSRCP: జనవరి నుంచి పింఛన్ ను రూ.2,750కి పెంచుతున్నాం: సీఎం జగన్
- కుప్పం బహిరంగ సభలో మాట్లాడిన జగన్
- ప్రస్తుతం రాష్ట్రంలో పింఛన్ రూ.2,500
- భవిష్యత్తులో పింఛన్ ను రూ.3 వేలకు పెంచుతామని వెల్లడి
ఛిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. జనవరి నెల నుంచి పింఛ న్లను రూ.2,750కి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా పింఛన్ విలువను ఇదివరకే చెప్పినట్లుగా రూ.3 వేలకు పెంచుతామని కూడా జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో వివిధ వర్గాలకు చెందిన వారికి పింఛన్ గా రూ.2,500 అందిస్తున్న సంగతి తెలిసిందే.
కుప్పం పర్యటనలో భాగంగా వైఎస్సార్ చేయూత కింద మూడో విడత నిధులను విడుదల చేసిన జగన్... తమ ప్రభుత్వం మహిళల ప్రభుత్వమని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తోందని ఆయన అన్నారు. అమ్మ ఒడి ద్వారా అక్కా చెల్లెమ్మలకు అండగా నిలబడ్డామన్నారు. గడచిన మూడేళ్లలోనే మహిళలకు రూ.1.17 లక్షల కోట్లను పంపిణీ చేశామన్నారు. తమ ప్రభుత్వ పథకాల అమలులో లంచాలు లేవని, మధ్యవర్తులు లేరని, వివక్ష లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.