MS Dhoni: మైదానంలో ఉన్నప్పుడు తనకు కోపం ఎందుకు రాదో చెప్పిన ధోనీ
- కెప్టెన్ కూల్ గా పేరుపొందిన ధోనీ
- మైదానంలో ప్రశాంతంగా కనిపించే మాజీ కెప్టెన్
- తనకు కూడా భావోద్వేగాలు ఉంటాయని వెల్లడి
- అయితే ఇతరుల కోణంలోనూ ఆలోచిస్తానని వివరణ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని పిలుస్తారని తెలిసిందే. మ్యాచ్ లో ఎంత టెన్షన్ నెలకొన్నప్పటికీ ధోనీ మాత్రం ప్రశాంతంగా కనిపిస్తాడు. బౌలర్ గానీ, ఫీల్డర్ గానీ పొరబాటు చేస్తే ధోనీ కోపగించుకోవడం అనేది అత్యంత అరుదైన విషయం. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తన కూల్ నెస్ కు కారణం ఏంటో ధోనీ వివరించాడు.
తాను కూడా మానవ మాత్రుడ్నే అని, అయితే మైదానంలో ఉన్నప్పుడు తన భావోద్వేగాలను అణచుకుంటానని తెలిపాడు. మైదానంలోకి దిగిన తర్వాత ఎవరూ తప్పులు చేయాలని కోరుకోరని, మిస్ ఫీల్డింగ్ కానివ్వండి, క్యాచ్ వదిలేయడం కానివ్వండి... ఎవరూ కావాలని చేయరని ధోనీ పేర్కొన్నాడు.
మైదానంలో ఎవరైనా ఫీల్డింగ్ లో బంతిని వదిలేసినా, క్యాచ్ డ్రాప్ చేసినా, అలా ఎందుకు చేశారని వారి కోణంలోంచి ఆలోచిస్తానని తెలిపాడు. కోపగించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డాడు. మైదానంలో 40 వేల మంది, ప్రపంచవ్యాప్తంగా ఇంకెంతో మంది మ్యాచ్ ను తిలకిస్తుంటారని తెలిపాడు.
ఓ ఆటగాడు 100 శాతం అంకితభావంతో ఆడుతూ ఓ క్యాచ్ వదిలేస్తే, అదేమంత సమస్యగా తాను భావించనని ధోనీ స్పష్టం చేశాడు. ప్రాక్టీసులో అతడెన్ని క్యాచ్ లు పట్టాడన్నది ఆలోచిస్తానని, క్యాచింగ్ లో ఏదైనా సమస్య ఉంటే దాన్ని అధిగమించడానికి అతడు ప్రయత్నం చేశాడా లేదా అనేది గమనిస్తానని వివరించాడు. వదిలిన క్యాచ్ గురించి కాకుండా, తాను ఇలాంటి విషయాలను ఆలోచిస్తానని తెలిపాడు.
తనకు కూడా అందరి లాగానే భావోద్వేగాలు ఉంటాయని, అందరి మనసుల్లో ఎలాంటి భావాలు ఉంటాయో తనకూ అలాంటి భావాలే ఉంటాయని అన్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో పొరబాట్లు బాధ కలిగిస్తాయని, కానీ ఆ సమయంలో మన భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు.
బయట కూర్చుని, ఇలా ఆడాలి, అలా ఆడాలి అని చెబుతుంటారని, కానీ మైదానంలో దిగిన తర్వాత అంచనాలకు తగినట్టుగా ఆడడం ఎంతో కష్టమని పేర్కొన్నాడు. టీమిండియా ఆటగాళ్లు ఎంతో శ్రమించి ఈ స్థాయి వరకు వచ్చారని, వారు ప్రపంచంలో ఎక్కడ ఆడినా వారికి మద్దతు ఇవ్వాలని ధోనీ పిలుపునిచ్చాడు.