Satyta Nadella: కార్పొరేట్ ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సమస్యను వివరించిన సత్య నాదెళ్ల
- కరోనా సమయంలో పలు రకాల పనివిధానాలు
- ఉద్యోగుల మందకొడితనంతో తగ్గిన ఉత్పాదకత
- కంపెనీ యాజమాన్యాల్లో ఆందోళన
- ప్రొడక్టివిటీ పారనోయాపై సత్య నాదెళ్ల వివరణ
- పనితీరు సజావుగా లేని ఉద్యోగులే కారణమని వెల్లడి
కరోనా రాక వల్ల కార్పొరేట్ సంస్థల పని విధానం మార్పులకు గురైంది. తొలుత కొన్నాళ్ల పాటు పూర్తిగా ఇంటి నుంచే పనిచేశారు. తర్వాత కొన్నిరోజులు ఇంటి నుంచి, కొన్నిరోజులు ఆఫీసు నుంచి పనిచేసే సరికొత్త పని విధానం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఉద్యోగులు దాదాపుగా అన్ని రకాల పని విధానాలకు అలవాటు పడ్డారు.
అయితే, కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు మాత్రం ఈ కొత్త పని విధానాల్లో ఉద్యోగుల పనితీరు, ఉద్పాదకతపై ఏమంత సంతృప్తికరంగా లేవని పలు నివేదికలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాటలే అందుకు నిదర్శనం.
కొత్త విధానంతో తమ పనితీరు బాగుందని ఉద్యోగులే చెప్పలేకపోతున్నారని, దాంతో ఉద్యోగులపై సంస్థలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని సత్య నాదెళ్ల వివరించారు. ఈ తరహా పని విధానంలో ఉద్యోగుల పనితీరు మందగించడం, తద్వారా ఉత్పాదకత తగ్గడం కార్పొరేట్ సంస్థలను ఆందోళనలకు గురిచేస్తోంది, ఈ ఆందోళనను 'ప్రొడక్టివిటీ పారనోయా' (ఉత్పాదకత భయం) అంటారని ఆయన వివరించారు.
అంచనాలకు అనుగుణంగా పనితీరు కనబర్చని ఉద్యోగుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుందని, నూతన పని విధానంలో అధిగమించాల్సిన అత్యంత తీవ్ర సమస్య ఇదేనని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఓ సర్వే ఆధారంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.