Chandrababu: అక్రమ అరెస్ట్ లకు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి ఏపీ పోలీసు శాఖను తీసుకువచ్చింది ఎవరు?: చంద్రబాబు

Chandrababu questions AP Police over journalist Ankababu arrest issue

  • సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్ట్
  • రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన కోర్టు 
  • తమ తప్పుడు వైఖరికి సీఐడీ సిగ్గుపడాలన్న చంద్రబాబు
  • మీ చర్యలకు మీరు మూల్యం చెల్లించుకోకతప్పదని వ్యాఖ్య 

ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబు రిమాండ్ రిపోర్టును గుంటూరు కోర్టు తిరస్కరించడం తెలిసిందే. దాంతో అంకబాబు విడుదలకు మార్గం సుగమమైంది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 

విజయవాడలో సీనియర్ పాత్రికేయుడు అంకబాబు అరెస్ట్ అక్రమం అని కోర్టు ఆయన రిమాండ్ తిరస్కరించిందని, దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంకబాబుకు 41-ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చే విషయంలో పోలీసులు చట్టాన్ని అనుసరించలేదని మేజిస్ట్రేట్ కోర్టు చెప్పిందని వివరించారు. 

అంతేకాకుండా, దీనిపై నాలుగు రోజుల్లో వివరణ ఇవ్వాలని సీఐడీ పోలీసులకు షోకాజ్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. నోటీసులు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చారు? మీరు ఆయనకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారనడానికి సాక్ష్యం ఏమిటి? అని కూడా న్యాయస్థానం ప్రశ్నించిందని చంద్రబాబు పేర్కొన్నారు. 

అక్రమ అరెస్ట్ లకు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి ఏపీ పోలీసు శాఖను తీసుకువచ్చింది ఎవరు? అని నిలదీశారు. తమ తప్పుడు వైఖరికి సీఐడీ సిగ్గుపడాలని, రాష్ట్రంలో చట్టాల ఉల్లంఘనలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైందని వివరించారు. 

'అక్రమ అరెస్టులపై పోలీసులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం మీరు (పోలీసులు) చేసే చట్ట ఉల్లంఘనలు మిమ్మల్ని సైతం బోనులో నిలబెడతాయి... మీ చర్యలకు మీరు మూల్యం చెల్లించుకోకతప్పదు' అని చంద్రబాబు హెచ్చరించారు. 

రాష్ట్రంలో ప్రజలను, రాజకీయ పక్షాలను భయపెట్టేందుకు అధికారం పూర్తిగా దుర్వినియోగం అవుతోందని, రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోందనడానికి ఇంతకంటే రుజువులు ఇంకేం కావాలని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు.

  • Loading...

More Telugu News