Brazil: ఒక్క మొసలిని చూస్తేనే భయం.. అలాంటిది ఒకేచోట వందల మొసళ్లను చూస్తే.. వీడియో ఇదిగో
- బ్రెజిల్ లోని సముద్ర తీరంలో ఒక్క చోట చేరిన మొసళ్లు
- మనుషుల నుంచి నగరాన్ని ఆక్రమించుకునేందుకు మొసళ్లు వస్తున్నట్టుగా ఉందని కామెంట్లు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.. 80 లక్షలకుపైగా వ్యూస్
సాధారణంగా ఎక్కడైనా మొసళ్లు కనిపిస్తే భయంతో ఎగిరి గంతేస్తుంటాం. నదిలోనో, సముద్ర తీరంలోనో మొసలిగానీ కనబడిందంటే.. అంతే జనాలు పరుగెత్తడమే. అంతటి ఏనుగైనా సరే నీటిలో దిగితే మొసలికి భయపడాల్సిందేనన్న నానుడి ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ఒకే చోట వందలు, వేల సంఖ్యలో మొసళ్లు ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి ఘటన బ్రెజిల్ సముద్ర తీరంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వేల కొద్దీ ఒకే చోట చేరడం చూసి..
- ఇటీవల బ్రెజిల్ బీచ్ పొడవునా వేల కొద్దీ మొసళ్లు ఒడ్డుకు వచ్చి నిలబడ్డాయి. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవునా బీచ్ లో అటూ ఇటూ తిరుగుతూ సందడి చేశాయి.
- ఈ మొసళ్లకు సంబంధించిన డ్రోన్ వీడియోను కెన్ రుట్‌కోవ్ స్కీ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘బ్రెజిల్ లోని ఓ బీచ్ లో వేల కొద్దీ మొసళ్ల ఆక్రమణ ఇది. ఇది చూసి స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు” అని క్యాప్షన్ పెట్టారు.
- భయం గొలిపేలా ఉన్న ఈ వీడియో త్వరగానే వైరల్ గా మారింది. ఏకంగా 80 లక్షలకుపైగా వ్యూస్ నమోదు కాగా.. లక్షల కొద్దీ లైకులు వస్తున్నాయి.
- ‘‘ఆ మొసళ్లను చూస్తుంటే మనుషుల నుంచి నగరాన్ని ఆక్రమించుకునేందుకు మొసళ్లు వస్తున్నట్టుగా ఉంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ‘‘ఆక్రమణ కాదు. ఒకప్పుడు మనుషులు ఆక్రమించుకున్న తమ భూమిని తాము తీసుకోవడానికి ఆ జీవులు వస్తున్నాయి..” అని మరో నెటిజన్ పేర్కొన్నారు.
- ‘‘ఈ మొసళ్లు యాకేర్ కైమన్ జాతికి చెందినవి. అవి కోల్డ్ బ్లడెడ్ (శీతల రక్త) జీవులు. అందువల్ల ఎండలో తమ శరీరాన్ని వేడి చేసుకోవడానికి అలా బీచ్ లో చేరాయి..” అని ఓ యూజర్ వివరించారు.