Chinta Mohan: ఎన్టీఆర్ పేరు మార్చడం ఎందుకు బంగారూ...!: సీఎం జగన్ పై చింతా మోహన్ విమర్శలు

Chinta Mohan comments on CM Jagan over NTR Health University name change

  • ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చిన ఏపీ సర్కారు
  • వైఎస్సార్ ఏం త్యాగాలు చేశాడని అడిగిన చింతా మోహన్ 
  • పొరుగు రాష్ట్రంలో ఎంజీఆర్ వర్సిటీ పేరు అలాగే ఉందని వెల్లడి

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ స్పందించారు. పేర్లలో ఏముందని ప్రశ్నించారు. ఓ బ్యారేజి ప్రారంభించి మేకపాటి రాజమోహన్ రెడ్డి కొడుకు పేరు పెట్టారు, అంతకుమించి ఏమీ లేదు అని అన్నారు. 

ఇక, ఎన్టీ రామారావు గొప్ప నటుడు, పెద్ద మనిషి, మంచి లీడర్ అని,  విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారని వివరించారు. 

"ఆ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం ఎందుకు బంగారూ... ఆయన పేరు మార్చడం వల్ల వైద్య సౌకర్యాలు ఏమన్నా ఎక్కువయ్యాయా! మీ నాన్న పేరు పెట్టుకోవడం ఎందుకు? మీ నాన్న భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ కు చేసిన త్యాగాలు ఏమైనా ఉన్నాయా? ఆయనేమైనా కష్టపడి డాక్టర్ చదివాడా? 

పక్కనే తమిళనాడులో ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ ఉంది. కరుణానిధి అధికారంలోకి రాగానే ఎంజీఆర్ పేరు తీసెయ్యలేదే! స్టాలిన్ అధికారంలోకి రాగానే ఎంజీఆర్ పేరు తీసేసి తన తండ్రి కరుణానిధి పేరు పెట్టుకోలేదే! 

ఎందుకయ్యా... ఎన్టీఆర్ పేరు తీసేసి మీ తండ్రి పేరు పెట్టావు? మీరు ఏంచేశారని ఆ నిర్ణయం తీసుకున్నారు? ఈ మూడున్నర సంవత్సరాల్లో వైసీపీ చేసింది ఏమీ లేదు. దగా తప్ప నిర్మాణాత్మకంగా మీ ప్రభుత్వం చేసింది సున్నా. 

ఇంకో విషయం కూడా అడుగుతున్నా.... జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఎందుకయ్యా! నీకిది ఎవరు నేర్పించారయ్యా! నిద్రపోతున్న జర్నలిస్టు అంకబాబును ఎత్తుకెళ్లి జైల్లో పెట్టడం ఏంటయ్యా! జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నావు, ఎంపీలను అరెస్ట్ చేస్తున్నావు, నీ చేతుల్లో పోలీసులు ఉన్నారు కదా అని నోరు విప్పినోళ్లందరినీ అరెస్ట్ చేస్తున్నావు. రేపు నీ పరిస్థితి ఏంటి?" అంటూ చింతా మోహన్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News