Karnataka: కాంగ్రెస్ పై కేసు పెడతానంటున్న కన్నడ యువ హీరో
- సమ్మతి లేకుండా కాంగ్రెస్ పోస్టర్లపై తన ఫొటోలు వాడటంపై హీరో అఖిల్ అయ్యర్ ఆగ్రహం
- 40 శాతం కమీషన్ ప్రభుత్వం అంటూ కర్ణాటక సర్కారుపై కాంగ్రెస్ పోస్టర్లు
- వాటిలో తన ఫొటోలు వాడినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అఖిల్ వెల్లడి
కాంగ్రెస్ పార్టీపై కేసు పెడతానని బెంగళూరుకు చెందిన నటుడు అఖిల్ అయ్యర్ అంటున్నాడు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ రూపొందించిన పోస్టర్లలో తన ఫొటో ఉపయోగించడంపై అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన అనుమతి లేకుండా పోస్టర్లలో తన ఫొటోను ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించాడు. బీజేపీపై కాంగ్రెస్ దాడిని పెంచడంతో బెంగళూరు అంతటా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చిత్రంతో ‘పేసీఎం పోస్టర్లు’ వేసింది. బీజేపీ హయాంలో ప్రతీ పనికి 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ‘40 శాతం సర్కార్’ అంటూ మరికొన్ని పోస్టర్లు రూపొందించింది. ఇలాంటి పోస్టర్లలో అఖిల్ అయ్యర్ ఫోటోను ఉపయోగించారు. ‘మీరు ఇంకా నిద్రమత్తులో ఉన్నారా? ఈ 40 శాతం సర్కారు 54,000 మంది యువకుల కెరీర్‌ను దోచుకుంది. దీనిపై స్పందించండి. సర్కారు అవినీతిని ఎండగట్టండి’ అని రాసి పోస్టర్లను ప్రచారం చేస్తోంది.
ఈ విషయం తెలిసిన అఖిల్ అయ్యర్ తన ఫొటోను చట్టవిరుద్ధంగా ఉపయోగించారని చెప్పాడు. ‘కాంగ్రెస్ ప్రచారానికి పోస్టర్లలో నా ముఖాన్ని చట్టవిరుద్ధంగా, నా సమ్మతి లేకుండా ఉపయోగించడాన్ని చూసి నేను భయపడిపోయాను. ఈ ప్రచారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అని ట్వీట్ చేశాడు. ఈ విషయంపై స్పందించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యలను ట్యాగ్ చేశాడు.