Hyderabad: హెచ్​సీఏ మరో తప్పిదం.. ఈ సారి టీ20 టికెట్లపై మ్యాచ్​ టైమింగ్​ తప్పుగా వేసిన వైనం

Another mistake by HCA  timing of the match was wrong on the T20 tickets

  • ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి టీ20 మ్యాచ్
  • టికెట్లపై గం. 7.30 నుంచి అని ముద్రించిన హెచ్ సీఏ
  • శనివారం రాత్రి వరకూ తప్పు గుర్తించని వైనం

భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ హైదరాబాద్ కు కేటాయించినప్పటి నుంచి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) వార్తల్లో నిలుస్తోంది. టికెట్ల విక్రయం నుంచి మ్యాచ్ ఏర్పాట్ల వరకూ అన్నింటా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. టికెట్లపై మ్యాచ్ టైమింగ్ ను కూడా తప్పుగా ముద్రించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. టాస్ గం. 6.30కే వేస్తారు. కానీ,  టికెట్లపై మ్యాచ్ గం. 7.30కు మొదలవుతుందని ముద్రించింది. పది రోజుల ముందు నుంచే టికెట్లు అమ్ముతున్నా..  హెచ్ సీఏ దీన్ని గుర్తించలేకపోయింది. చివరకు శనివారం రాత్రి మ్యాచ్ గురించి మీడియాకు ఓ ఈమెయిల్ పంపించింది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవుతుందని దాని సారాంశం. కానీ, టికెట్లపై టైమింగ్ ను తప్పుగా ముద్రించిన విషయాన్ని మాత్రం హెచ్ సీఏ ఒప్పుకోకపోవడం గమనార్హం. టికెట్లపై టైమ్ ను చూసి అభిమానులు గం. 7.30కి వస్తే అరగంట ఆటను కోల్పోనున్నారు. 

ఈ మ్యాచ్ విషయంలో ముందు నుంచీ హెచ్ సీఏ వైఖరిపై చాలా విమర్శలు వస్తున్నాయి. టీ20కి సంబంధించి 39వేల టికెట్లు ఉంటే సాధారణ ప్రజలకు అందులో సగం కూడా అందుబాటులో ఉంచలేదు. పేటీఎంలో దొరక్క కౌంటర్లలో కొనేందుకు అభిమానులు జింఖానా మైదానానికి పోటెత్తితే అక్కడ కేవలం మూడు వేల టికెట్లను మాత్రమే అమ్మింది. వేల సంఖ్యలో వచ్చిన అభిమానుల మధ్య తోపులాట జరగ్గా పలువురికి గాయాలయ్యాయి. కానీ, ఈ ఘటనకు మాకేం సంబంధం లేదని హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చేతులు దులుపుకున్నారు. దాదాపు 12,500 టికెట్లు ఏం చేశారో, ఎవరికి అమ్మారో అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇంకోవైపు మ్యాచ్ కు సమయం దగ్గర పడుతున్నా స్టేడియంలో ఏర్పాట్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారన్న విమర్శలూ ఉన్నాయి. ఉప్పల్ స్టేడియంలో దుమ్మూ, దూళి, పక్షుల వ్యర్థాలతో నిండిన సీట్లను సరిగ్గా శుభ్రం చేయలేదంటూ సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News