India: విదేశాల్లో జాబ్స్ పేరిట భారత ఐటీ నిపుణులను మయన్మార్ తీసుకెళ్లి హింసిస్తున్న ముఠాలు
- జాగ్రత్తగా ఉండాలని భారత యువకులను హెచ్చరించిన విదేశీ మంత్రిత్వ శాఖ
- థాయ్ లాండ్ లో మంచి ఉద్యోగాలని నమ్మిస్తున్న నకిలీ ఐటీ సంస్థలు
- విదేశాల్లో జాప్ ఆఫర్ వస్తే అన్ని వివరాలు తెలుసుకోవాలని సూచన
విదేశాల్లో ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆకర్షించే ముఠాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని భారత ఐటీ నిపుణులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మన దేశంలోని ఐటీ నైపుణ్యం ఉన్న యువతను నకిలీ జాబ్ రాకెట్లు లక్ష్యంగా చేసుకుంటున్నాయని తెలిపింది. ఈ నకిలీ ఐటీ సంస్థలు థాయ్‌లాండ్‌లో మంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ యువతకు వల వేస్తున్నాయని చెప్పింది.
బ్యాంకాక్, మయన్మార్ నుంచి ఈ విషయమై పలు ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. కాల్ సెంటర్ కుంభకోణం, క్రిప్టోకరెన్సీ మోసాలకు పాల్పడిన ఐటీ సంస్థలు ఇప్పుడు రూటు మార్చాయని.. థాయ్‌లాండ్‌లో 'డిజిటల్ సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్' ఉద్యోగాలు ఉన్నాయంటూ భారతీయ యువకులను ప్రలోభపెడుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకోసం సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తూ వారిని ఆకర్షిస్తున్నాయని చెప్పింది.
ఉద్యోగాలు ఆశించిన యువతను మయన్మార్‌లోకి తీసుకువెళ్తున్నారని, అక్కడ వీరిని బందీలుగా మార్చి కఠినమైన పరిస్థితుల్లో పని చేయిస్తున్నారని తెలిపింది. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా జాబ్ ఆఫర్‌ను ఒప్పుకునే ముందు విదేశాల్లోని సంబంధిత ఇండియా మిషన్ల ద్వారా కంపెనీల యజమానుల గురించి, రిక్రూటింగ్ ఏజెంట్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించింది. థాయ్‌లాండ్‌లో ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయిన 60 మందిలో 30 మంది భారతీయులను మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయం ఇటీవల రక్షించింది.
మరోవైపు కెనడాలో ద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి భారతీయులు జాగ్రత్తగా ఉండాలని విదేశీ మంత్రిత్వ శాఖ సూచించింది. పంజాబ్ ను ప్రత్యేక ఖలిస్థాన్ గా విడగొట్టాలంటూ కెనడాలోని కొన్ని సంస్థలు ప్రచారం నిర్వహించినట్టు వార్తలు రావడంతో మోదీ ప్రభుత్వం ఈ హెచ్చరిక చేసినట్టు తెలుస్తోంది. కెనడాలో దాదాపు 16 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు.