Hana: 9 ఏళ్ల భారతీయ బాలిక ఐఓఎస్ యాప్ డిజైన్ చేయడంపై విస్మయం చెందిన ఆపిల్ సీఈవో టిమ్ కుక్

Apple CEO Tim Cook lauds 9 years old Indian girl Hana who designed IOS app

  • దుబాయ్ లో ఉంటున్న తొమ్మిదేళ్ల హనా
  • కథలు రికార్డు చేసే యాప్ తయారుచేసిన బాలిక
  • సొంతంగా యాప్ కోడ్ రాసిన వైనం
  • భవిష్యత్తులో అద్భుతాలు చేస్తావన్న టిమ్ కుక్

టెక్ నైపుణ్యాల్లో భారతీయుల ప్రతిభాపాటవాలు ప్రపంచానికి కొత్త కాదు. తాజాగా 9 ఏళ్ల భారతీయ బాలిక ఐఓఎస్ యాప్ తయారుచేసి అందరినీ ఔరా అనిపించింది. దుబాయ్ లో ఉండే ఈ బాలిక టెక్నాలజీని ఔపోసన పట్టి యాప్ తయారుచేసిన తీరు పట్ల ఐఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కూడా విస్మయం చెందారు. 

ఆ బాలిక పేరు హనా మహ్మద్ రఫీక్. తనపేరు కలిసి వచ్చేలా 'హనాస్' అనే కథల యాప్ ను ఆమె రూపొందించింది. ఈ యాప్ లో చిన్నారుల తల్లిదండ్రులు కథలను రికార్డు చేయవచ్చు. ఐఓఎస్ ప్లాట్ ఫాంపై ఈ యాప్ ను ఉచితంగా పొందవచ్చు.

కాగా తాను యాప్ తయారుచేసిన వైనాన్ని హనా... ఈమెయిల్ ద్వారా టిమ్ కుక్ కు వివరించింది. ఐదేళ్ల వయసు నుంచే తాను కోడింగ్ నేర్చుకుంటున్నానని, ఈ క్రమంలో ఓ యాప్ రూపొందించిన అత్యంత పిన్న వయస్కురాలిని తానే అని భావిస్తున్నానని తెలిపింది. 

ఐఓఎస్ యాప్ డిజైన్ చేసే క్రమంలో ఎలాంటి థర్డ్ పార్టీ రెడీమేడ్ కోడ్ లను వినియోగించలేదని, 10 వేల లైన్ల కోడ్ ను సొంతంగానే రాశానని హనా వెల్లడించింది. 

దీనిపై ఆపిల్ సీఈవో టిమ్ కుక్ స్పందించారు. హనా... ఇంత చిన్నవయసులోనే నీ ఘనతలు ఆకట్టుకునేలా ఉన్నాయి, ఎంతో ప్రశంసనీయం అని కొనియాడారు. ఈ నైపుణ్యాన్ని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తావని శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News