FNCC: ఎఫ్ఎన్సీసీ ఎన్నికల్లో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గెలుపు.. ఆర్భాటంగా బరిలోకి దిగి ఓడిన బండ్ల గణేశ్
- ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటించిన రిటర్నింగ్ అధికారి
- ఉపాధ్యక్ష పదవి కోసం పోటీ పడిన బండ్ల గణేశ్
- తుమ్మల రంగారావు చేతిలో ఓటమి
- అల్లు అరవింద్, సురేశ్ బాబు, కేఎల్ నారాయణ ప్యానెల్ విజయం
హైదరాబాదు, జూబ్లీ హిల్స్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లో నిన్న జరిగిన ఎన్నికల్లో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అధ్యక్షుడిగా గెలుపొందారు. ఉపాధ్యక్షుడి పదవి కోసం బరిలోకి దిగి, ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేశ్ ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం గత రాత్రి నిర్వహించిన ఓట్ల లెక్కింపు తర్వాత ఆదిశేషగిరిరావు అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చౌదరి ప్రకటించారు. బండ్ల గణేశ్‌పై తుమ్మల రంగరావు విజయం సాధించారు.
రెండేళ్లకోసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే ఎఫ్ఎన్సీసీలో మొత్తం 4,600 మంది సభ్యులుండగా, అందులో 1,900 మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. నిన్నటి ఎన్నికల్లో అల్లు అరవింద్, సురేశ్ బాబు, కేఎల్ నారాయణ ప్యానల్ సభ్యులు విజయం సాధించారు. కార్యదర్శిగా ముళ్లపూడి మోహన్, ఉపాధ్యక్షుడిగా తుమ్మల రంగారావు, కోశాధికారిగా రాజశేఖర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీగా వీవీఎస్ఎస్ పెద్దిరాజు ఎన్నికయ్యారు. ఏడిద రాజా, ఇంద్రపాల్‌రెడ్డి, వడ్లపట్ల మోహన్, సీహెచ్ వర ప్రసాదరావు, శైలజ, కాజా సూర్యనారాయణ, దర్శకుడు మురళీమోహన్, బాలరాజు, గోపాలరావు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.