Bollywood: మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు ఊరట
- మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన పాటియాలా కోర్టు
- రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుకేశ్ చంద్రశేఖర్
- అతని నుంచి ఖరీదైన వస్తువులు తీసుకున్న జాక్వెలిన్ పైనా కేసు నమోదు
మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కాస్త ఊరట లభించింది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమెకు సోమవారం మధ్యంతర బెయిల్ లభించింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు రూ. 50 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్న జాక్వెలిన్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఆమెను రెండుసార్లు విచారించారు. ఆమె ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టారు. బాలీవుడ్ నటికి సుకేశ్ రూ. 7 కోట్లకు పైగా విలువైన ఆభరణాలను బహుమతిగా ఇచ్చాడు. జాక్వెలిన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఖరీదైన కార్లు, బ్యాగులు, దుస్తులు, గడియారాలను కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
ఈడీ విచారణలో ఈ విషయాలను జాక్వెలిన్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. దాంతో, ఈ కేసులో ఆమె పేరు కూడా చేర్చిన ఈడీ.. అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ ను పరిశీలించిన న్యాయస్థానం సోమవారం కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దాంతో, పాటియాలా కోర్టుకు వచ్చిన జాక్వెలిన్ మధ్యంతర బెయిలు కోసం దరఖాస్తు చేసింది. రెగ్యులర్ బెయిల్ అంశం కోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు. దీనికి పాటియాలా కోర్టు అంగీకరించి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను అక్టోబర్ 22వ తేదీకి వాయిదా వేసింది.