Ghulam Nabi Azad: కొత్త పార్టీ పేరును ప్రకటించిన గులాంనబీ అజాద్
- డెమొక్రటిక్ అజాద్ పార్టీగా నామకరణం
- ప్రజాస్వామ్య పార్టీగా ఉంటుందని ప్రకటన
- ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసి ఆ పార్టీకి రాజీనామా సమర్పించిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ రాజకీయ నేత గులాంనబీ అజాద్ కొత్త పార్టీని ప్రకటించారు. డెమొక్రటిక్ అజాద్ పార్టీగా తన కొత్త పార్టీకి పేరును నిర్ణయించారు. పార్టీ జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్న నెల రోజుల తర్వాత ఆయన సొంత పార్టీని స్థాపించినట్టయింది.
తమకంటూ స్వతంత్ర ఆలోచన, సిద్ధాంతాలు ఉంటాయని అజాద్ ప్రకటించారు. తమది ప్రజాస్వామ్య పార్టీ అవుతుందన్నారు. ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేసుకోవడం తదుపరి ప్రాధాన్యతగా చెప్పారు. ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చనీ, తమ రాజకీయ కార్యకలాపాలు కొనసాగుతాయనీ అన్నారు.
నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికతో అజాద్ పార్టీ జెండా రూపుదిద్దుకుంది. ‘‘ఇందులో పపుసు రంగు అన్నది సృజనాత్మకత, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. తెలుపు అన్నది శాంతికి చిహ్నం. నీలం రంగు స్వేచ్ఛ, ఊహలకు ప్రతిరూపం’’ అని అజాద్ పేర్కొన్నారు.