Anand Mahindra: ‘విజయ దశమి’ శుభాకాంక్షలు చెప్పడంలోనూ ఆనంద్ మహీంద్రా రూటే వేరు
- హ్యాపీ నవరాత్రి అంటూ శుభాకాంక్షలు వ్యక్తీకరణ
- దుర్గా మాత తొమ్మిది అపురూప ఆశీర్వచనాలు ఇవ్వాలని ఆకాంక్ష
- ట్విట్టర్ లో ప్రత్యేక పోస్ట్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా రూటే సెపరేటు. ఆయన నలుగురికీ భిన్నంగా, వినూత్నంగా, సృజనాత్మకంగా స్పందిస్తుంటారు. అందుకే ట్విట్టర్లో ఆయనకు 97 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. చాలా మంది రాజకీయ నేతలకు కూడా ఈ స్థాయి ఫాలోవర్లు లేరు. నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆనంద్ మహీంద్రా హ్యాపీ నవరాత్రి అంటూ శుభాకాంక్షలు తెలిపారు. పది మందిలో స్ఫూర్తి నింపే విధంగా ఆయన ఒక ఇమేజ్ పోస్ట్ చేశారు.
ఆశ్వయుజ మాసం శుక్ల పాడ్యమితో మొదలయ్యే నవరాత్రి వేడుకలు దశమి (విజయదశమి)తో ముగుస్తాయి. ‘‘మా దుర్గ తొమ్మిది (నవ) విలువైన ఆశీర్వచనాలతో మిమ్మల్ని శక్తిమంతం చేయాలి’’ అని ఇమేజ్ లో సందేశం ఉంది. డిటర్మినేషన్ (పట్టుదల, సంకల్పం), సక్సెస్ (విజయం), డివోషన్ (భక్తి), ఫోకస్ (ఏకాగ్రత, దృష్టి), కాన్సిస్టెన్సీ (స్థిరత్వం, నిలకడ), పాజిటివిటీ (సానుకూలత), డిసిప్లేన్ (క్రమశిక్షణ), స్ట్రెంత్ (మనోబలం), హోప్ (ఆశ)ను అందిపుచ్చుకోవాలని ఆనంద్ మహీంద్రా అభిలషించారు.