YSRCP: వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
- ఇదివరకే దేవిరెడ్డికి బెయిల్ నిరాకరించిన హైకోర్టు
- హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన దేవిరెడ్డి
- హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
- దేవిరెడ్డికి బెయిల్ ఇవ్వడానికి కారణాలేమీ కనిపించడం లేదని వెల్లడి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. తనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆమధ్య హైకోర్టు జారీ చేసిన తీర్పును సవాల్ చేస్తూ శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు దేవిరెడ్డి సహా పలువురు నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తనకు బెయిల్ ఇవ్వాలంటూ దేవిరెడ్డి సహా పలువురు నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... హైకోర్టు అందుకు నిరాకరించింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ... హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. దేవిరెడ్డికి బెయిల్ మంజూరు చేయడానికి తగిన కారణాలేమీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.