Chandrababu: వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లేనని ఈ ముఖ్యమంత్రి బొంకుతున్నాడు: చంద్రబాబు
- మంగళగిరి ఎయిమ్స్ కు నీటి కొరత అంటూ చంద్రబాబు స్పందన
- ప్రభుత్వం సిగ్గుపడాలని వ్యాఖ్యలు
- ఎయిమ్స్ కోసం ఈ మూడున్నరేళ్లలో ఏంచేశారన్న టీడీపీ అధినేత
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ కు కనీసం నీటి సరఫరా చేయలేని ప్రభుత్వాన్ని ఏమనాలి? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు, ఈ మూడున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎయిమ్స్ కోసం ఏంచేసిందో చెప్పగలదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
నాడు టీడీపీ హయాంలో ఎయిమ్స్ కు భూములు కేటాయించి, వసతులు కల్పించి, వైద్య సేవలకు ఈ ప్రతిష్ఠాత్మక సంస్థను సిద్ధం చేశామని వెల్లడించారు. అటువంటి సంస్థ... పెరిగిన తమ అవసరాల కోసం అదనంగా నీటి వనరులు సమకూర్చాలని లేఖలు రాసినా పరిష్కరించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని చంద్రబాబు విమర్శించారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో సైతం అసత్యాలు చెప్పుకున్న ముఖ్యమంత్రి.... తానుంటున్న మున్సిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నాడు? అంటూ నిలదీశారు. స్వయంగా కేంద్రమంత్రులు సైతం నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పందించని ఈ ముఖ్యమంత్రి... వైద్యరంగంలో సమూల మార్పులు తనవల్లేనని బొంకుతున్నాడని విమర్శించారు.
మీ చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదని, వెంటనే మంగళగిరి ఎయిమ్స్ కు అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.