Alligator: వాటర్ పార్క్ లో వదిలితే అలా తేలుతూ వెళ్లిపోయింది.. వైరల్ అయిన మొసలి వీడియో ఇదిగో
- అమెరికాలోని ఇల్లినాయిస్ వాటర్ పార్క్ లో ఘటన
- ఏటా వేసవి ముగిశాక చివరి విజిటర్ గా మొసలిని తీసుకొచ్చే అధికారులు
- ఈసారి కూడా తీసుకొస్తే.. నీటిలో మధ్యన తేలుతున్నట్టుగా ఎంజాయ్ చేసిన మొసలి
సాధారణంగా మొసళ్లు బాగా యాక్టివ్ గా ఉంటాయి. ఉన్నంత సేపు ఓపిగ్గా కదలకుండా ఉన్నా.. అటూ ఇటూ వెళ్లినప్పుడు వాటి కదలికలు వేగంగానే ఉంటాయి. కానీ అమెరికాలోని ఓ జూపార్క్ లో ఒక మొసలి మాత్రం సోమరితనానికే చిరునామా అన్నట్టుగా, నీటి మధ్యలో అలా తేలిపోతూ ఉండటం చిత్రంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇల్లినాయిస్ వాటర్ పార్క్ లో..
- అమెరికాలోని ఇల్లినాయిస్ వాటర్ పార్క్ లో ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఇక్కడ ఎండాకాలం సీజన్ ముగుస్తుండగా వాటర్ పార్క్ ను మూసివేస్తారు. ఈ సందర్భంగా చివరి విజిటర్ గా ఒక మొసలిని తీసుకువచ్చి.. వాటర్ పార్క్ లోని చిన్నపాటి కాల్వలో వదులుతారు. ఆ మొసలి అందులో కావాల్సినంత సేపు తిరిగాక.. వాటర్ పార్క్ లోకి అధికారికంగా విజిటర్ల ప్రవేశాన్ని నిలిపివేస్తారు.
- ఈసారి అలా వాటర్ పార్క్ నిర్వాహకులు ది స్కావిల్ జూ నుంచి జీ అనే 39 ఏళ్ల మొసలిని తీసుకువచ్చారు. దానిని ఈ నీటి కాలువ ముందు వదిలారు.
- మెల్లగా కాలువలోకి దిగిన మొసలి.. నీటిలో ఈదకుండా అలాగే ఉండిపోయింది. నీరు మెల్లగా ప్రవహిస్తున్న కొద్దీ అందులో కొట్టుకుపోతున్నట్టుగా ఉండిపోయింది. కనీసం నిలువుగా ఉండేందుకూ ప్రయత్నించలేదు.
- అలా చాలా సేపు నీటిలో తేలుతున్నట్టుగా ఉండిపోయింది. అయితే అప్పుడప్పుడూ మాత్రం కాసేపు అటూ ఇటూ మెల్లగా కదిలింది. మొత్తానికి కాసేపటి తర్వాత మెల్లగా నీటిలోంచి బయటికి వచ్చి ఎండలో ఉండిపోయింది.
- కొంతసేపటి తర్వాత ఆ మొసలిని అధికారులు జూకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షకుపైగా వ్యూస్ రాగా.. వేలాది లైక్ లు వచ్చాయి.
- నిజానికి ఆ నీటి కాల్వను మొసలి బాగా ఇష్టపడిందని.. అందుకే అలా ప్రవర్తించి ఉంటుందని జూ అధికారులు చెబుతున్నారు.