Sensex: నేడు కూడా స్టాక్ మార్కెట్ లో నష్టాలే!
- నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
- అమ్మకాల ఒత్తిడిలో షేర్లు
- ఐటీ షేర్లు పదిలం
- నష్టాల్లో మెటల్, ఆటోమొబైల్ షేర్లు
గత నాలుగు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలకు ఏదీ కలిసి రావడంలేదు. ఇవాళ కూడా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 953 పాయింట్లు నష్టపోయి 57,145 వద్ద ముగియగా, నిఫ్టీ 311 పాయింట్ల నష్టంతో 17,016 వద్ద స్థిరపడింది. ఈ రెండు మార్కెట్ సూచీల్లో నేటి ట్రేడింగ్ లో 1.7 శాతం సంపద తరిగిపోయింది.
ఈ ఉదయం నుంచి గ్లోబల్ ట్రెండ్స్ భారత మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఆసియా మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కాగా, యూరప్ మార్కెట్లు అంతకంటే తీవ్ర నష్టాలతో కుదేలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లకు గేట్లు ఎత్తడంతో ప్రపంచవ్యాప్త ప్రకంపనలు కనిపించాయి. షేర్లు అమ్మకాల ఒత్తిడితో కింద చూపులు చూశాయి.
ఐటీ షేర్లు మినహా మెటల్, ఆటోమొబైల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు, సహజవాయువు, రియాల్టీ షేర్లు అధికంగా నష్టపోయాయి.
ఐటీ షేర్లు ఇవాళ్టి ట్రేడింగ్ లో కళకళలాడాయి. హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు 1 శాతానికి మించి లాభపడగా, అదానీ పోర్ట్స్ 6 శాతానికి పైగా నష్టపోయింది. టాటా మోటార్స్, హిండాల్కో, మారుతి 5 శాతానికి పైగా నష్టాలు చవిచూశాయి.