Type-1 Diabetes: 2040 నాటికి టైప్-1 డయాబెటిస్ రోగుల సంఖ్య రెట్టింపు
- ప్రపంచంలో 8.4 మిలియన్ల మంది టైప్-1 మధుమేహ రోగులు
- మరో 18 ఏళ్లలో 17.4 మిలియన్లకు పెరిగే అవకాశం
- మందులతో మధుమేహ నియంత్రణ
- టైప్-1 మధుమేహానికి ఇన్సులిన్ చికిత్స
ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలను కబళించడంలో మధుమేహం పాత్ర చాలా ఉంది. జీవనశైలి కారణంగా, జన్యుపరంగా చాలామంది ఈ డయాబెటిస్ బారినపడుతుంటారు. మందుల సాయంతో షుగర్ ను నియంత్రించుకోవడం తప్పనిసరి. లేకపోతే ప్రాణాలకే ముప్పు ఉంటుంది.
ప్రస్తుతం ప్రపంచంలో 8.4 మిలియన్ల మంది టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. వీరి సంఖ్య 2040 నాటికి రెట్టింపు కానుందట. మరో 18 ఏళ్లలో ఈ సంఖ్య 17.4 మిలియన్లకు చేరుకుంటుందని ఓ అంచనా. 'ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ' జర్నల్ లో ఈ మేరకు అధ్యయనం తాలూకు వివరాలు ప్రచురించారు.
టైప్-1 మధుమేహం ఎక్కువగా కౌమార దశలో ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే పాంక్రియాస్ కణాలపై శరీర కణాలే దాడిచేసే పరిస్థితి నెలకొంటుంది. తద్వారా ఇన్సులిన్ లోపంతో మధుమేహం బారినపడతారు.
ఈ టైప్-1 డయాబెటిస్ ను గుర్తించినా సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా 2021లో 3.1 మిలియన్ల మంది మరణించారని, ఇక తాము టైప్-1 డయాబెటిస్ బారినపడ్డామని తెలుసుకోలేక 7 లక్షల మంది మరణించారని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం 8.4 మిలియన్ల మంది టైప్-1 మధుమేహంతో బాధపడుతుండగా, వారిలో 20 ఏళ్ల లోపు వారు 18 శాతం, 20 నుంచి 59 ఏళ్ల లోపు వారు 64 శాతం, 60 ఏళ్లకు పైబడిన వారు 19 శాతం మంది ఉన్నారు. టైప్-1 డయాబెటిస్ అత్యధికంగా నిర్ధారణ అవుతున్న వారి సగటు వయసు 32 సంవత్సరాలు అని వెల్లడైంది.
ఈ తరహా మధుమేహం కేసులు అత్యధికంగా అమెరికా, భారత్, బ్రెజిల్, చైనా, జర్మనీ, బ్రిటన్, రష్యా, స్పెయిన్, కెనడా, సౌదీ అరేబియా దేశాలోల నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే టైప్-1 డయాబెటిస్ కేసుల్లో 60 శాతం కేసులు పైదేశాల్లోనే నమోదవుతున్నాయి.
20 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలో అత్యధిక కేసులు ఉన్నది భారత్ లోనే అని అధ్యయనం చెబుతోంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ గణాంకాల ప్రకారం భారత్ లో ఈ తరహా కేసులు 2,29,400 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, ఏటా 24,000 కొత్త కేసులు నమోదవుతున్నాయట.
టైప్-1 మధుమేహ బాధితులు వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. టైప్-1 డయాబెటిస్ రోగులకు నోటి ద్వారా వేసుకునే మందులతో కలిగే ఉపశమనం తక్కువ అని, వారికి నేరుగా ఇన్సులిన్ చికిత్సతోనే సత్ఫలితాలు కలుగుతాయని వైద్య నిపుణులు వెల్లడించారు.