Yarlagadda Lakshmi Prasad: జగన్ నా దృష్టిలో హీరో... ఆయనను నేను ఎందుకు తిట్టాలి?: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
- ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి పేరు మార్పు
- రాజీనామా చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
- నేడు ప్రెస్ మీట్ లో తన అభిప్రాయాల వెల్లడి
- తానేమీ స్వరం మార్చడంలేదని స్పష్టీకరణ
ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించడం ద్వారా ఏపీ ప్రభుత్వం తీవ్ర చర్చకు ఆజ్యం పోసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరుపెట్టడం, తదనంతరం అధికార భాషా సంఘం చైర్మన్ పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేయడం తెలిసిందే.
అయితే, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇటీవల జరిగిన పరిణామాలపై తన గళం వినిపించారు. సీఎం జగన్ ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఆయన తన దృష్టిలో హీరో అని కొనియాడారు. గతంలో జగన్ ను సోనియా కేంద్రమంత్రిని చేస్తానని చెప్పినప్పటికీ, ఏం అవసరం లేదంటూ ఓదార్పు యాత్రకు వెళ్లిపోయిన వ్యక్తి జగన్ అని తెలిపారు.
"ఆ తర్వాత పిచ్చి కేసులో, మంచి కేసులో 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు... ఆ తర్వాత 3,850 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 151 ఎమ్మెల్యేలను, 23 మంది ఎంపీలను గెలిపించుకున్నాడు. ఇది హీరోయిజం కాదా?" అని అన్నారు.
అయితే ఆయన చేసే పనులు కొందరికి నచ్చకపోవచ్చని పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నేను అడగకుండానే అధికార భాషా సంఘం చైర్మన్ ని చేశారని వెల్లడించారు. అయితే, ఇప్పుడు పేరు మార్చడం అనేది మంచి సంప్రదాయం కాదని, ఒక పేరు పెట్టిన తర్వాత దాన్ని మార్చుకుంటూ వెళితే ఎక్కడ దానికి అంతం ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇది నా మనసుకు నచ్చలేదు కాబట్టే పదవులు వదిలేస్తున్నానని ఇంతకుముందే స్పష్టంగా చెప్పానని యార్లగడ్డ వివరించారు. నిత్యం ప్రజల మధ్యే వుండే జగన్ ను నేనెందుకు తిట్టాలి? అని ప్రశ్నించారు. జగన్ ను దూషించి, మరో పార్టీ వాళ్లను పొగడాలా? అంటూ వ్యాఖ్యానించారు.
తానేమీ స్వరం మార్చలేదని యార్లగడ్డ స్పష్టం చేశారు. రాజీనామాపై మరోమాటకు తావులేదని, తాను పదవిలో లేనప్పటికీ తెలుగు భాష ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు. ఒక భాషా ప్రచార అభిమానిగా అంతకుముందు పదిహేనేళ్లుగా ఏం చేశానో, ఇకపైనా అదే చేస్తానని అన్నారు. రాజకీయాలు మాట్లాడబోనని తేల్చి చెప్పారు.