Telangana: ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
- క్యాసినో కేసులో ఏడుగురు రాజకీయ నేతలకు ఈడీ నోటీసులు
- చీకోటి ప్రవీణ్ విచారణ తర్వాత నోటీసుల జారీ
- మంచిరెడ్డి మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డట్టు ఈడీ ఆరోపణ
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్న ఈడీ అధికారులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన క్యాసినో కేసులో టీఆర్ఎస్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం తమ కార్యాలయంలో విచారిస్తున్నారు. రాజకీయ, వ్యాపార రంగాలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులతో క్యాసినో ఆడిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్‌పై కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఆయనను ఇదివరకే విచారించిన సంగతి తెలిసిందే.
చీకోటి ప్రవీణ్ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు రాజకీయ నేతలకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ ఏడుగురికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వారిలో మంచిరెడ్డి కూడా ఉన్నారు. ఈ నోటీసుల ఆధారంగానే ఆయన మంగళవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
క్యాసినోలో భాగంగా హవాలా మార్గంలో నగదు బదిలీ చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్టుగా ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని కూడా ఈడీ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో విచారణకు పిలిచిన మంచిరెడ్ది నుంచి ఈడీ అధికారులు స్టేట్ మెంట్ నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ఈడీ అధికారులు విచారిస్తున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.