KVP Ramachandra Rao: పోలవరం ప్రాజెక్టు విషయంలో.. జగన్ కు కేవీపీ రామచంద్రరావు లేఖ
- పోలవరం నిర్మాణాన్ని కేంద్రం విస్మరించిందన్న కేవీపీ
- ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతలను వదిలేసిందని వ్యాఖ్య
- కేంద్రం వైఖరి వల్లే పొరుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నాయన్న కేవీపీ
- ఇవన్నీ వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని సీఎంకు వినతి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతలను కేంద్రం వదిలేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్లే ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఛత్తీస్ గఢ్, ఒడిశా ప్రభుత్వాలు సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సైతం పోలవరంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని లేఖలో ఆయన ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి పొరుగు రాష్ట్రాలను ఒప్పించడం, పర్యావరణ నిబంధనల ప్రకారం కరకట్టలను నిర్మించడం, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం వంటి బాధ్యతలు కేంద్రానివే అని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని జగన్ కు రాసిన లేఖలో కేవీపీ సూచించారు.