USA: పాక్ తో ఎఫ్-16 డీల్ పై భారత్ కు బదులిచ్చిన అమెరికా
- గతంలో పాక్ కు ఎఫ్-16 విమానాలు ఇచ్చిన అమెరికా
- తాజాగా విడిభాగాల సరఫరా
- ఒప్పందం విలువ 450 మిలియన్ డాలర్లు
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్
గతంలో అందజేసిన ఎఫ్-16 విమానాల కోసం తాజాగా పాకిస్థాన్ కు అమెరికా 450 మిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలు సరఫరా చేసేందుకు నిర్ణయించడం తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ డీల్ హేతుబద్ధతను భారత్ ప్రశ్నిస్తుండడం పట్ల అమెరికా స్పందించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ వ్యాఖ్యలకు అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ బదులిచ్చారు.
భారత్, పాకిస్థాన్ వేర్వేరు అంశాల్లో తమకు భాగస్వామ్య దేశాలని స్పష్టం చేశారు. "తాజా ఒప్పందం నేపథ్యంలో పాకిస్థాన్ తో మా సంబంధాలు ఎలా ఉన్నాయన్నది చూడలేదు, భారత్ తో మా సంబంధాలను చూడలేదు. అదే సమయంలో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలను చూడలేదు. భారత్, పాక్ లను భిన్నమైన అంశాల్లో మాకు భాగస్వాములుగా భావిస్తాం... వాటిని ఆ విధంగానే చూస్తాం. అనేక అంశాల్లో విలువలు, ప్రయోజనాలు పంచుకుంటున్నాం. భారత్ తో మా మైత్రి దానికదే ప్రత్యేకం, పాకిస్థాన్ తో మా మైత్రి దానికదే ప్రత్యేకం" అని నెడ్ ప్రైస్ వివరించారు. ఈ కోణంలోనే ఎఫ్-16 డీల్ ను చూడాలని పేర్కొన్నారు.