Supreme Court: నోట్ల రద్దుపై రేపటి నుంచి సుప్రీం విచారణ.. ఆన్ లైన్ లో ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం!
- దాదాపు ఆరేళ్ల తర్వాత పిటిషన్లపై విచారణ చేపడుతున్నట్టు ప్రకటించిన కోర్టు
- జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ
- ప్రత్యక్ష ప్రసారాల నేపథ్యంలో నోట్ల రద్దుపై విచారణను ఆన్ లైన్ లో నేరుగా వీక్షించే అవకాశం
దాదాపు ఆరేళ్ల కిందట దేశంలో కలకలం రేపిన నోట్ల రద్దు (డీమానిటైజేషన్) అంశంపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టనుంది. నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై సెప్టెంబరు 28వ తేదీ నుంచి.. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం మొదలైన నేపథ్యంలో నోట్ల రద్దుపై విచారణను కూడా అందరూ వీక్షించే అవకాశం కలుగుతోంది.
ఆరేళ్ల కిందే పిటిషన్లు దాఖలైనా..
దేశంలో నల్ల ధనం నిర్మూలన, నకిలీల నియంత్రణ కోసం 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.1,000, రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. 2016 డిసెంబరు 16న కోర్టు ఈ పిటిషన్లపై విచారణ బాధ్యతను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. అయినా ఇప్పటివరకు విచారణ మొదలుకాలేదు. ఇన్నేళ్ల తర్వాత తాజాగా ఆ పిటిషన్లపై విచారణకు కోర్టు సిద్ధమైంది.
ఒక్కసారిగా షాకిచ్చి..
2016 నవంబర్ 8న దేశంలో నోట్ల రద్దుకు సంబంధించి ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ఆర్థిక వ్యవస్థలో బ్లాక్ మనీ లేకుండా చేయడానికి, పారదర్శకత పెంచడం, నకిలీ నోట్ల నిర్మూలన లక్ష్యంగా ఈ చర్య చేపట్టినట్టు పేర్కొన్నారు. రూ.100, అంతకన్నా తక్కువ విలువైన నోట్లను మాత్రం యథాతథంగా కొనసాగించారు. అయితే తర్వాత కొన్నాళ్లకు రూ.500, రూ.2వేల నోట్లను కొత్తగా ప్రవేశపెట్టారు. కానీ అవి అందుబాటులోకి వచ్చేసరికి ఆలస్యం కావడం, ఏటీఎంలలో డబ్బుల కోసం జనాలు బారులు తీరడం వంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి.