Sandeep Lamichhane: స్టార్ క్రికెటర్ ను అరెస్ట్ చేసేందుకు ఇంటర్ పోల్ సాయం తీసుకుంటున్న నేపాల్ ప్రభుత్వం

Interpol issue diffusion notice over Nepal cricketer Sandeep Lamichhane

  • చిక్కుల్లో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానే
  • సందీప్ పై అత్యాచార ఆరోపణలు
  • అరెస్ట్ వారెంట్ జారీ.. ప్రస్తుతం అజ్ఞాతంలో సందీప్ 
  • సభ్యదేశాలకు సమాచారం అందించిన ఇంటర్ పోల్

సందీప్ లామిచానే... ఐపీఎల్ ను ఫాలో అయ్యేవారికి ఈ పేరు సుపరిచితమే. నేపాల్ జాతీయుడు అయినప్పటికీ, తన లెగ్ స్పిన్ బౌలింగ్ నైపుణ్యంతో ఐపీఎల్ తలుపుతట్టాడు. 2018 నుంచి 2020 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 

22 ఏళ్ల సందీప్ లామిచానే నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా. బిగ్ బాష్, సీపీఎల్ వంటి లీగ్ పోటీల్లోనూ ఆడుతుంటాడు. అయితే, అతడిప్పుడు పరారీలో ఉన్న నేరస్థుడు. 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో అతడిపై నేపాల్ లో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. జాతీయ జట్టు నుంచి అతడిని సస్పెండ్ చేశారు. 

అతడిని పట్టుకునేందుకు నేపాల్ ప్రభుత్వం తాజాగా ఇంటర్ పోల్ సాయం కోరింది. దాంతో ఇంటర్ పోల్ సందీప్ లామిచానే సమాచారం తెలియజేయాలంటూ సభ్యదేశాలకు నోటీసులు జారీ చేసింది. అతడిని అరెస్ట్ చేసేందుకు సభ్యదేశాలు సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొంది. 

లామిచానే ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో సీపీఎల్ పోటీల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణల పట్ల అతడు స్పందిస్తూ, త్వరలోనే నేపాల్ కు వస్తానని, తన మీద వచ్చిన ఆరోపణలపై పోరాడతానని వెల్లడించాడు. ప్రస్తుతం తన మానసిక, శారీరక ఆరోగ్యం బాగాలేనందున ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపాడు. అయితే తాను ఏ దేశంలో ఉన్నదీ వివరించలేదు. తనపై అరెస్ట్ వారెంట్ జారీ కావడం తీవ్రంగా కలచివేసిందని అన్నాడు.

  • Loading...

More Telugu News