Molly Gilbert: తాను గర్భవతినని తెలుసుకున్న మరుసటి రోజే బిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ యువతి!
- నాటింగ్ హామ్ షైర్ లోని ట్రోవెల్ ప్రాంతంలో నివసించే 25 ఏళ్ల మోలీ
- 39 వారాల తర్వాత గర్భవతినని తెలుసుకున్న మోలీ
- పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన వైనం
- లక్షణాలు కనిపించకపోవడంతో గర్భం తెలుసుకోలేకపోయిన మోలీ
సాధారణంగా మహిళలు గర్భంతో ఉన్న విషయం మూడో నెలలో తెలుస్తుంది. మొత్తమ్మీద నవమాసాలు మోసి మహిళలు మాతృత్వపు మధురిమలు చవిచూస్తారు. అయితే బ్రిటన్ లో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఓ యువతి తాను గర్భవతినని తెలుసుకున్న మరుసటి రోజే బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకీ ఆమె గర్భవతినని తెలుసుకున్నది 39 వారాల తర్వాత!
ఆమె పేరు మోలీ గిల్బర్ట్. 25 ఏళ్ల మోలీ నాటింగ్ హామ్ షైర్ లోని ట్రోవెల్ ప్రాంతంలో నివసిస్తుంటుంది. ఆమె సెప్టెంబరు 7న పండంటి మగ బిడ్డను ప్రసవించింది. విస్మయం కలిగించే విషయం ఏమిటంటే... తాను గర్భవతినని ఆమెకు తెలిసింది కాన్పుకు ముందురోజేనట.
సహజంగా గర్భం దాల్చినప్పుడు స్త్రీలలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, వికారంగా ఉండడం, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే బ్రిటన్ యువతి మోలీ గిల్బర్ట్ లో ఈ లక్షణాలేవీ లేకపోవడంతో తాను గర్భం దాల్చిన విషయాన్ని ఇన్నాళ్ల పాటు ఆమె తెలుసుకోలేకపోయింది. కొంత బరువు పెరగడం తప్ప ఇతర మార్పులేవీ కనిపించలేదు.
ఆమె ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం కొంతకాలంగా ఆసుపత్రికి వెళుతున్నా గానీ, ఆమె గర్భం సంగతి ఆసుపత్రి సిబ్బంది కూడా గుర్తించలేకపోయారు. తనకు బిడ్డ పుట్టడంపై మోలీ గిల్బర్ట్ స్పందిస్తూ ఆర్నెల్ల కిందటే సహజీవన భాగస్వామితో విడిపోయానని, గర్భం వచ్చే అవకాశాలే లేవని భావించానని పేర్కొంది. తన మాజీ భాగస్వామికి ఈ విషయం చెబితే అతడు నమ్మలేకపోయాడని వివరించింది.
కాగా ఆమె తండ్రి విన్స్ గిల్బర్ట్ స్పందిస్తూ, ఆసుపత్రిలోని వైద్యులు ఇన్నాళ్ల పాటు తన కుమార్తె గర్భాన్ని గుర్తించలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మనవడు పుట్టడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశాడు.